హైదరాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ నాయకత్వం సామాన్య కార్యకర్తలకు భరోసాగా నిలుస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ కార్యకర్తలపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా.. భారత రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను గుర్తు చేస్తూ.. సుప్రీంకోర్టు వరకూ వెళ్లి కార్యకర్తల కోసం పోరాడుతున్నది. అందుకు తాజా ఉదాహరణ నల్లబాలు అలియాస్ శశిధర్‌గౌడ్ కేసు. ఒక సాధారణ సోషల్ మీడియా కార్యకర్త కోసం సుప్రీంకోర్టు వరకూ వెళ్లి కేసు గెలిచింది బీఆర్ఎస్ లీగల్ సెల్. తెలంగాణ ప్రభుత్వ నిరంకుశ వైఖరిని రాష్ట్ర హైకోర్టు ఎండగట్టినప్పటికీ, ఆ తీర్పును సవాల్ చేస్తూ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. భారీగా ఫీజులు తీసుకునే సిద్ధార్థ్ లూథ్రా లాంటి టాప్ అడ్వకేట్‌తో కేసులు వాదించింది. ఒక సాధారణ కార్యకర్త కోసం దిగ్గజ న్యాయవాదిని సైతం న్యాయబద్ధంగా ఎదుర్కొని.. సుప్రీంకోర్టులో కేసు గెలిచింది బీఆర్ఎస్ లీగల్ సెల్.
కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుతూ..
కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన 250 అక్రమ కేసుల్లో కార్యకర్తలను బీఆర్ఎస్ లీగల్ సెల్ కంటికి రెప్పలా కాపాడుతున్నది. రెండేండ్లుగా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలోనూ, సోషల్‌మీడియాలోనూ బీఆర్ఎస్ పార్టీ నిలదీస్తున్నది. అదే లైన్‌ను కార్యకర్తలు సైతం అందుకొని.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. దీంతో ఉకిరిబికిరి అవుతున్న ప్రభుత్వం.. కేసులు, అరెస్టులతో బీఆర్ఎస్ నాయకులు, సోషల్ మీడియా వారియర్లు, క్యాడర్‌ను భయపెట్టాలని చూస్తున్నది. ఈ నేపథ్యంలో బాధితులకు అండగా నిలుస్తున్నది బీఆర్ఎస్ లీగల్ సెల్.
లక్షలాది మందికి భరోసాగా లీగల్ సెల్
సుమారు 250 కేసులు పెట్టి కొందరిని అరెస్ట్ చేయగా, పార్టీ లీగల్ సెల్ ఎప్పటికప్పుడు కోర్టులను ఆశ్రయించి అక్రమ అరెస్ట్‌లను అడ్డుకుంటున్నది. ఇదే క్రమంలో బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్ నల్ల బాలు (శశిధర్‌గౌడ్)ను అక్రమంగా అరెస్ట్ చేస్తే హైకోర్టుకు వెళ్లి బీఆర్ఎస్ లీగల్ సెల్ కొట్లాడింది. దీంతోపాటు మరే ఇతర సోషల్ మీడియా వారియర్‌ను అక్రమంగా అరెస్ట్ చేయకుండా ఒక చారిత్రాత్మక తీర్పును బీఆర్ఎస్ లీగల్ సెల్ తీసుకురాగలిగింది.
తెలంగాణలోని కోట్లాది మంది బీఆర్ఎస్ కార్యకర్తలకు, లక్షలాది మంది సోషల్ మీడియా వారియర్లకు అండగా నిలిచింది. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఇప్పుడు ‘శశిధర్‌గౌడ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ’ అనే కేసు తీర్పునే ఉదహరిస్తుండటం గమనార్హం. దేశవ్యాప్తంగా కూడా ఎలాంటి అక్రమ కేసుల్లో అరెస్టు చేయకుండా తీర్పును తీసుకురాగలిగింది బీఆర్ఎస్ లీగల్ సెల్. ఒక సామాన్య కార్యకర్తను కాపాడుకోవడానికి సుప్రీంకోర్టు దాకా వెళ్లి కొట్లాడుతున్న బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పట్టుదల పార్టీలో కొత్త జోష్ నింపుతున్నది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆలోచన మేరకు ఏర్పడిన ‘బీఆర్ఎస్ లీగల్ సెల్’ ఇప్పుడు దేశంలోని ఇతర పార్టీలకు ఆదర్శంగా నిలుస్తున్నది.