హైదరాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో త్వరలో జరుగనున్న మున్సిపల్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా భారత రాష్ట్ర సమితి సిద్ధమైంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లకు ప్రత్యేక సమన్వయకర్తలను నియమించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి మున్సిపాలిటీకి ఒక సీనియర్ నాయకుడిని ఎన్నికల ఇన్చార్జిగా బాధ్యతలు అప్పగించారు. క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను ఏకం చేయడం, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఎన్నికల వ్యూహాలు రూపొందించడం సమన్వయకర్తల బాధ్యత. ఎన్నికల ప్రక్రియ ప్రారం భం నుంచి ముగిసే వరకు వీరు నిరంతరం ఆయా ము న్సిపాలిటీల్లో అం దుబాటులో ఉం టారు.
అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో కీలకపాత్ర పోషిస్తారు. స్థానిక నాయకత్వంతో చర్చించి, గెలుపు గుర్రాలను గుర్తించి, నివేదికలను ఎప్పటికప్పుడు పార్టీ అధిష్ఠానానికి సమర్పిస్తారు. పార్టీ రూపొందించిన ప్రచార కార్యక్రమాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లడం, బూత్ లెవల్ ఏజెంట్లను సమన్వయం చేయడం వంటి అంశాలను పర్యవేక్షిస్తారు. ఎన్నికల సరళిని, గ్రౌండ్ రిపోర్టులను ఎప్పటికప్పుడు పార్టీ కేంద్ర కార్యాలయానికి, వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు నివేదించేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటుచేశారు. మున్సిపల్ ఎన్నికల సమన్వయకర్తల పూర్తి జాబితాను వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం అధికారికంగా విడుదల చేశారు. ప్రజల మద్దతుతో మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలని కేటీఆర్ సూచించారు.
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం కసరత్తును వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఎన్నికల విధుల్లో పాల్గొనబోయే సాధారణ, వ్యయ పరిశీలకులకు శనివారం ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించారు. హైదరాబాద్ ఏసీ గార్డ్స్‌లోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్నికల కమిషనర్ రాణికుముదిని పరిశీలకులకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల సమయంలో నిర్వహించాల్సిన బాధ్యతలు, క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ, అభ్యర్థుల ఎన్నికల వ్యయంపై నిఘా వంటి కీలక అంశాలపై శిక్షణ ఇచ్చారు. ఎన్నికలను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నట్టు ఎన్నికల సంఘం కార్యదర్శి జీ లింగ్యానాయక్ ఒక ప్రకటనలో తెలిపారు.