హైదరాబాద్, సెప్టెంబర్26 (నమస్తే తెలంగాణ) : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ప్రస్తుతం ఉన్న 23% రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇది చెల్లుబాటు అవుతుందా? చట్టం ముందు నిలుస్తుందా? అనే చర్చ బీసీ వర్గాల్లో, రాజకీయవర్గాల్లో నడుస్తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం 2018లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్ కల్పిస్తూ జీవో-396ను జారీ చేసింది. దానిని సవాల్ చేస్తూ మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకులు హైకోర్టును ఆశ్రయించారు. ఇది సుప్రీంకోర్టు విధించిన 50% సీలింగ్‌కు వ్యతిరేకమని వాదించారు. దీంతో హైకోర్టు జీవో-396ను రద్దు చేసింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే, అత్యున్నత ధర్మాసనం ఆ పిటిషన్‌ను తిరస్కరించింది. దీంతో సుప్రీంకోర్టు 2011లో విధించిన 50% సీలింగ్‌కు లోబడి స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లను ఖరారు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్సీలకు 20.53%, ఎస్టీలకు 6.68%, బీసీలకు 22.79% చొప్పున మొత్తంగా 49.50% రిజర్వేషన్లు కల్పిస్తూ స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించింది. బీసీలకు రిజర్వేషన్లు దక్కకుండా నాడు అడ్డుకున్న కాంగ్రెస్సే ఇప్పుడు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో జారీ చేసింది. అది ఎస్సీ, ఎస్టీలతో కలిపితే సుప్రీంకోర్టు విధించిన సీలింగ్‌ను దాటిపోనున్నది. ఈ నేపథ్యంలో జీవో-9 చెల్లుబాటవుతుందా? అనే చర్చ బీసీ సంఘాల నేతల మధ్య జరుగుతున్నది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే రాజ్యాంగపరమైన రిజర్వేషన్లు ఉన్నాయి. కానీ, బీసీలకు లేవు. ఆర్టికల్స్ 243-డీ(6), 243-టీ(6) ప్రకారం మాత్రమే ఇతిమిద్ధంగా, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఇష్టానుసారం రిజర్వేషన్లను కలిస్తూ వస్తున్నాయి. వాటిపై న్యాయవివాదాలు తలెత్తడం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలో ఓబీసీలకు అమలుచేస్తున్న రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ట్రిపుల్ టీ పేరిట మార్గదర్శకాలు జారీచేసింది. వీటిలో మొదటిది ప్రతి స్థానిక సంస్థలో ఓబీసీ రిజర్వేషన్ల అమలు, ఫలితాలపై అధ్యయనం చేసేందుకు పూర్తిస్థాయి రాజ్యాంగబద్ధమైన, డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలి. రెండవది జనాభా నిష్పత్తికి అనుగుణంగా రిజర్వేషన్లను స్థిరీకరించాలి. మూడవది రిజర్వేషన్లు కూడా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కలిపి మొత్తంగా 50% మించకూడదు. ఆ మార్గదర్శకాలు పాటించని ఏ రాష్ట్రంలో కూడా స్థానికసంస్థల ఎన్నికల్లో ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేయకూడదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఆ నిబంధనలను పాటించని గుజరాత్, మహారాష్ట్రతోపాటు పలు రాష్ర్టాల్లో స్థానికసంస్థల ఎన్నికలను రద్దు చేసింది. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పించింది. తద్వారా 50% సీలింగ్ దాటిపోతున్నది.
ఇదిలా ఉంటే బీసీ రిజర్వేషన్ల స్థిరీకరణ, ఇంటింటి సర్వే, డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు, అందుకు సంబంధించిన జీవోల జారీ ఇలా ప్రతీ అంశంలోనూ రేవంత్ సర్కార్ సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా, ఇష్టానుసారంగా వ్యవహరించిందనే విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత 42% రిజర్వేషన్‌పై న్యాయనిపుణులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. అంతేకాదు, ప్రభుత్వం జీవో-9 జారీ చేయకముందే పలువురు హైకోర్టును ఆశ్రయించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తే మొత్తం రిజర్వేషన్లు 68 శాతానికి చేరుతాయని, అది సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్ధమని పేర్కొంటూ మేడ్చల్-మలాజిగిరి జిల్లా మూడుచింతలపల్లి మండలం కేశవాపూర్‌కు చెందిన సామాజిక కార్యకర్త బుట్టెంగారి మాధవరెడ్డి, సిద్దిపేట జిల్లా కొండూరుకు చెందిన జల్లపల్లి మల్లవ్వ పిటిషన్ దాఖలు చేశారు. అయితే, పత్రికా వార్తల ఆధారంగా పిటిషన్ దాఖలు చేయడానికి వీల్లేదని చెప్తూ హైకోర్టు వాటిని కొట్టేసింది. అయితే, రిజర్వేషన్లు 50 శాతానికి మించి కల్పిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేస్తే పిటిషన్ దాఖలు చేసే స్వేచ్ఛ ఉంటుందని స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వం జీవో-9 జారీ చేయడంతో కోర్టులో నిలుస్తుందా? లేదా? అని బీసీ సంఘాలు చర్చించుకుంటున్నాయి.