Polytechnic | హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ): వచ్చే విద్యాసంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని పాలిటెక్నిక్ కాలేజీల్లో ఈవీపై సబ్జెక్టును ప్రవేశపెడతారు. రాష్ట్రంలో 85కు పైగా ఈవీ కంపెనీలున్నాయి. వీటిలో కొన్ని తయారీసంస్థలు ఉండగా, మరికొన్ని సర్వీస్స్టేషన్లు, చార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి. భవిష్యత్తులోను మరికొన్ని సంస్థలు ఏర్పాటయ్యే అవకాశమున్నది. వీటి ఏర్పాటుతో ఈ రంగంలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించనుండటంతో మన విద్యార్థులు ఆయా అవకాశాలను అందిపుచ్చుకోవాలన్న ఆలోచనతో ఎలక్ట్రిక్ వాహనాల సబ్జెక్టును ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నారు.
ఈవీ కోర్సు నిర్వహణకు సాంకేతిక విద్యామండలి అధికారులు ఇండో జర్మన్ ఒకేషనల్ ఎడ్యుకేషనల్ ట్రైనింగ్, జీఐజెడ్ సంస్థలతో ఇటీవలే ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ సబ్జెక్టును పూర్తిచేసిన వారికి జీఐజెడ్ సంస్థతో పాటు ఇతర కంపెనీల్లో గ్యారెంటీ ప్లేస్మెంట్స్ కల్పిస్తారు. కోర్సు నిర్వహణకు జీఐజెడ్ కంపెనీ సహకారంతో సమగ్రంగా అధ్యయనం చేశారు. ఐఐటీలు, ఇతర విద్యాసంస్థల్లో అమలవుతున్న కోర్సులను సమగ్రంగా అధ్యయనం చేసి పాలిటెక్నిక్ విద్యార్థులకు అవసరమైన పాఠ్యాంశాలతో కూడిన కరిక్యులాన్ని తయారుచేశారు. దీనిని కాలేజీలకు పంపి వచ్చే విద్యాసంవత్సరంలో 5వ సెమిస్టర్లోని విద్యార్థులంతా తీసుకొనేలా ప్రోత్సహించాలని ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులకు సూచించారు.