
మెదక్, డిసెంబర్ 3: రైతులు ప్రతిపక్షాల ఉచ్చులో పడొద్దని సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి సూచించారు. రైతులకు నష్టం కలిగిస్తున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీల కు గుణపాఠం తప్పదని హెచ్చరించారు. సీఎం సూచనలతో యాసంగిలో రైతులు ఇతర పంటలను సాగు చేయాలని కోరారు. శుక్రవారం మెదక్ జిల్లా హవేళీ ఘనపూర్ మండలం కూచన్‌పల్లి లోని తన వ్యవసాయ క్షేత్రంలో సుభాష్‌రెడ్డి ఆరుతడి పంటలైన మక్క, పొద్దుతిరుగుడు, మినుము, గుమ్మడి, జనుము, పత్తి సాగుకు శ్రీకారంచుట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడా రు. ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ, కాంగ్రెస్ నాయకులు కనీస పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ధాన్యం కొనబోమని పార్లమెంట్లో కేంద్ర మంత్రులు చెప్తుంటే.. తెలంగాణలో మాత్రం బీజేపీ నాయకులు వరి వేయాలని రైతులను రెచ్చగొట్టడం సరికాదన్నారు. రైతు సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషిచేస్తున్నారని తెలిపారు. కేంద్రం కుట్రలను తిప్పికొట్టేందుకు రైతులు సీఎం కేసీఆర్‌కు అండగా నిలువాలని కోరారు.