హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ) : బంగాళాఖాతంలో ఉత్తర ఒడిశా- పశ్చిమబెంగాల్ తీర ప్రాంతంలో అల్పపీడనంతో పాటు మరో ద్రోణి ఏర్పడింది. ఈ ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో పలుచోట్ల జల్లులతోపాటు ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురు గాలులు వీస్తాయని అంచనా వేసింది. శనివారం ఉత్తర తెలంగాణ జిల్లాల్లో బలమైన గాలులతోపాటు ఈ నెల 22 వరకు మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
గడిచిన 24గంటల్లో కామారెడ్డి జిల్లా బాన్సువాడలో అత్యధికంగా 7.23 సెం.మీ, రంగారెడ్డి జిల్లా రెడ్డిపల్లిలో 4.3 సెం.మీ, నల్లగొండ జిల్లా చండూరులో 3.5 సెం.మీ వర్షం కురిసినట్టు తెలిపింది. రుతుపవనాలు ప్రారంభమై 45 రోజులు అవుతున్నా.. ఇప్పటి వరకు రాష్ట్రంలో పెద్ద వర్షం పడలేదు. రాష్టంలోని 33 జిల్లాల్లో లోటు వర్షపాతమే నమోదైంది.
జూన్లో 130.3 మి.మీ సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 115.3 మి.మీటర్లు నమోదైంది. జూలైలో సాధారణ వర్షపాతం 227.4 మి.మీటర్లుగా వాతావరణశాఖ అంచనా వేసింది. శుక్రవారం వరకు 118.2 మి.మీటర్లు నమోదు కావాల్సి ఉండగా, 47.2 మి.మీటర్లు మాత్రమే నమోదైంది. జూన్, జూలైలో 35 శాతం లోటు వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది.