హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం ఉపాధి పథకాన్ని నిర్వీర్యం చేస్తుందనడానికి అధికారిక లెక్కలే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. దేశ వ్యాప్తంగా ఉపాధి హామీ సగటు పనిదినాలు గణనీయంగా తగ్గాయి. బీఆర్ఎస్ ఎంపీలు రంజిత్ రెడ్డి, మాలోతు కవితలు అడిగిన ప్రశ్నకు మంగళవారం కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మార్చి 7వ తేదీ నాటికి 45.34 సగటు పనిదినాలు అయినట్టు కేంద్ర మంత్రి తెలిపారు. గత రెండు సంవత్సరాల్లో వరుసగా 51.53రోజులు, 50.07రోజులు సగటు పని దినాలు ఉన్నాయి. మరో 23 రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనుంది. ఈ నేపథ్యంలో సగటు పనిదినాలు తగ్గుతాయని అంచనా వేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి సగటు పనిదినాలు గణనీయంగా తగ్గాయి. రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో కేంద్రం తనిఖీలు, షరతులు, ఉదయం, సాయంత్రం ఫొటోలు తీయాలనే నిబంధనలు పెట్టింది. వేసవిలో పనిచేస్తే అదనపు వేతనం ఇవ్వకపోవడం లాంటి వాటితో సగటు పనిదినాలు తగ్గాయి. దీంతో ఈ సంవత్సరం మార్చి 7 నాటికి రాష్ట్రంలో సగటున 42.03 పనిదినాలు మాత్రమే అయ్యాయి.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం క్రమక్రమంగా ఉపాధి హామీని రద్దు చేసే దిశగా అడుగులు వేస్తున్నది. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ సంపదను పెంచి పేద ప్రజలకు పంచాలనే విధానాన్ని పాటిస్తుంటే కేంద్రం మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. గత రెండేండ్లలో కేంద్రం బడ్జెట్లోనే 55 వేల కోట్లను ఉపాధి హామీకి కోతను విధించింది. ఒకవైపు పని దినాలు తగ్గిపోతున్నాయి. మరోవైపు పని దినాల ద్వారా వచ్చే మెటీరియల్ కాంపోనెంట్ కూడా తరిగిపోతున్నది.
– మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు