హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ కళాశాలల్లో కాంట్రాక్ట్, గెస్ట్ లెక్చరర్లను జూలై 31 వరకు కొనసాగించాలని అధికారులు నిర్ణయించారు. శుక్రవారం ఇంటర్ విద్య డైరెక్టర్ శృతి ఓజా ఆదేశాలిచ్చారు. గెస్ట్ లెక్చరర్లకు జరుగుతున్న అన్యాయం, వారి పరిస్థితిపై ‘నమస్తే తెలంగాణ’ ఇటీవలే వరుసగా రెండు కథనాలు ప్రచురించింది. ‘గెస్ట్ లెక్చరర్లు ఉన్నట్టా లేనట్టా’, ‘గెస్ట్ లెక్చరర్లకు రేవంత్ సర్కారు ధోకా’ పేరుతో కథనాలను ప్రచురించింది.
435 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు నోటిఫికేషన్
హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ): వైద్యారోగ్య శాఖలో 435 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు శుక్రవారం నోటిఫికేషన్ విడుదలైంది. డీఎంఈ, డీపీహెచ్, ఐపీఎం పోస్టులకు వచ్చే నెల 2నుంచి దరఖాస్తులు ప్రారంభం కాగా, 11తో ముగియనున్నవి. ఎంబీబీఎస్‌లో మెరిట్ ఆధారంగా 80 పాయింట్లు కేటాయించనున్నారు. ప్రభుత్వ దవాఖానలు, సంస్థల్లో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నవారికి అనుభవం ఆధారంగా 20 మార్కులు కలుపుతారు. గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తున్నవారికి ప్రతి ఆరు నెలల సర్వీస్‌కు 2.5 పాయింట్లు, గిరిజనేతర ప్రాంతాల్లో పనిచేస్తున్నవారికి 2 పాయింట్లు ఇవ్వనున్నారు. పే స్కేలు రూ.58,850 నుంచి రూ.1,37,050గా ఉన్నది.