Telangana | హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొందరు పోలీసు అధికారుల తీరు తీవ్ర వివాదాస్పదంగా మారింది. చట్టాన్ని రక్షించాల్సినవారే చట్టాన్ని తమకు అనుకూలంగా మలచుకొని కాసుల వేటలో పడ్డారు. మంచి పోస్టింగ్ ఉన్నపుడే డబ్బులు కూడబెట్టుకోవాలన్న ధోరణితో అడ్డగోలుగా అక్రమాలకు తెరతీస్తున్నారు. తమను అడ్డుకునేవారు లేరన్నట్టుగా వారి ప్రవర్తన ఉంటున్నది. వీరిని అదుపులో ఉంచాల్సిన కొందరు సీనియర్ అధికారులు కూడా చూసీచూడనట్టు వ్యవహరిస్తుండటంతో ఇలాంటివారు ఆడిందే ఆటగా సాగుతున్నది.
రాష్ట్రంలో అత్యంత కీలకమైన జిల్లాల్లో మంచి పోస్టులు సాధించినవారు పోస్టుల్లో చేరటమే ఆలస్యం.. వసూళ్ల రంగంలోకి దిగుతున్నట్టు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇలాంటివారిపై అక్కడక్కడ ఒకట్రెండు చర్యలుంటున్నప్పటికీ, తూతూమంత్రంగానే ఉంటున్నాయి. దీంతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వం వీరిపై గట్టి చర్యలు తీసుకునేందుకు వెనుకాడుతున్నది.
రాష్ట్ర సరిహద్దుల్లో మహారాష్ట్రకు దగ్గరగా ఉండే ప్రాంతంలో ప్రత్యేకాధికారిగా పనిచేసిన ఓ యువ ఐపీఎస్.. మట్కా గ్యాంగ్‌లను పోషించటంలో ప్రసిద్ధుడు. ఆయన అండ చూసుకొని మట్కా గ్యాంగ్‌లు రెచ్చిపోయాయి. మట్కా వంటి జూదాన్ని తెలంగాణలో నిషేధించారు. మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉండటంతో ఆయన అవకాశాన్ని మలచుకున్నారు. ఒక్క మట్కాతోనే ఆయన ఆగలేదు. క్రికెట్ బెట్టింగ్లలోనూ ఆరితేరారు. ఆయన నడిపించే బెట్టింగ్ గ్యాంగ్‌ల రేంజ్ రూ.25 లక్షలపైగా ఉంటుంది. అంటే.. నికరంగా ప్రతి క్రికెట్ మ్యాచ్‌కు ఆయనకు రూ.25 లక్షలకు తక్కువ ముట్టదు.
సరిహద్దు జిల్లాలో ఉన్న ఆయనను హైదరాబాద్‌కు బదిలీ చేశారు. ఇక్కడ కూడా అదే దందా కొనసాగిస్తున్నారు. ఈయన వ్యవహారశైలి పోలీసుశాఖలోని అనేక మందికి తెలుసు. అయినా ఎవ్వరూ ఏమీ అనరు. రాబోయే పదేండ్లలో తాను రాజకీయ రంగంలోకి వెళ్లాలనుకుంటున్నట్టు చెప్తున్న ఆ యువ ఐపీఎస్.. రాజకీయాలకు అవసరమైన డబ్బు సంపాదనే లక్ష్యమని తన మిత్రుల వద్ద వ్యాఖ్యానిస్తున్నట్టు తెలిసింది. ఆయన తీరు వివాదాస్పదమైనప్పటికీ ఉన్నతాధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నట్టు సమాచారం.
ఉమ్మడి మెదక్ జిల్లాలో కీలక అధికారిగా పనిచేస్తున్న ఓ ఐపీఎస్ కూడా డబ్బుల వేటలో పడ్డారు. దీపం ఉన్నపుడే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న లక్ష్యంతో ఉన్న ఈయన.. కొంతమంది కింది స్థాయి అధికారులను కేవలం వసూళ్ల కోసమే నియమించుకున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రధానంగా భూదందాలపై దృష్టిసారిస్తున్నట్టు ఆరోపణలున్నాయి. హైదరాబాద్‌కు అత్యంత సమీపంలో ఉండే ఓ ప్రాంతంలోని సివిల్ పంచాయితీలో తలదూర్చి తనకు అనుకూలమైన వ్యక్తికి భూబదిలీ అయ్యేలా చూశారని పెద్దఎత్తున ఆరోపణలున్నాయి. రకరకాల కంపెనీల్లోని భాగస్వామ్యుల మధ్య ఉండే గొడవలను కూడా ఈయన చాకచక్యంగా వాడుకుంటారనే ఆరోపణలు వస్తున్నాయి.
ఓ యువ ఐపీఎస్ అధికారి భర్త ఐఏఎస్. అయితే, ఆ ఐపీఎస్ ఏకంగా భూదందాలు మొదలుపెట్టారని సమాచారం. విషయం ఉన్నతాధికారులకు చేరడంతో ఆమెకు చార్జిమెమో ఇచ్చి సరిపెట్టారు. ఐపీఎస్ కావడంతో ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా వదిలివేశారని, కింది స్థాయి అధికారులు ఆమెలా భూదందాలు చేస్తే సస్పెండ్ చేసేవారని చెప్తున్నారు. గతంలో మహబూబ్‌నగర్, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో పనిచేసిన మరో అధికారి ఏకంగా ఎన్నికల నిధులనే నొక్కేశారన్న ఆరోపణలు వచ్చాయి.
ఆయనపై శాఖాపరమైన విచారణ చేశారు. ఈయనకు కూడా మెమో ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు. మెదక్, నల్లగొండ, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో పనిచేసిన మరో ఐపీఎస్ అధికారిణి పేకాట క్లబ్బులనే తెరిచారు. ఆమె నగరంలో ఓ అపార్ట్‌మెంట్‌ను కిరాయికి తీసుకొని తమవారినే అక్కడ పెట్టి పేకాట కేంద్రాన్ని నడిపించారన్న ఆరోపణలున్నాయి. ఒక్కరిద్దరు కాదు.. మరో అయిదారుగురు అధికారులు ఇదే తరహా ఆరోపణలు ఎదుర్కొంటున్నారని పోలీసువర్గాలే చెప్తున్నాయి.
హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలో కొంతమంది ఐపీఎస్‌లను బదిలీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. హైదరాబాద్‌లో ఫోన్ ట్యాపింగ్ అంశంతో ముడిపడిన ఓ అధికారి అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నట్టు ఉన్నతాధికారులు గుర్తించారు. వినాయక నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ ఉండటంతో ఆయనను బదిలీ చేయలేదు. ఒకట్రెండు రోజుల్లోనే బదిలీ చేయనున్నట్టు సమాచారం. మత ఘర్షణలను సమర్థంగా నివారించలేకపోయారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒకరిద్దరు అధికారులను కూడా మార్చే అవకాశం ఉన్నది. మొత్తంగా ఐదారుగురు ఐపీఎస్‌లను బదిలీ చేయనున్నారు. వీరితోపాటు ఇటీవల ఐపీఎస్ హోదా సాధించినవారిలో ఆరుగురికి పోస్టింగ్ ఇవ్వనున్నారు.