Ration Dealer | రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ)/కలెక్టరేట్: రాజన్న సిరిసిల్ల జిల్లాలో రేషన్ డీలర్ల నియామక ప్రక్రియ వివాదాస్పదంగా మారింది. కాంగ్రెస్ కార్యకర్తలకే కట్టబెడుతున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోస్టులను డబ్బులకు అమ్ముకుంటున్నారంటూ కాంగ్రెస్ కార్యకర్త మీడియా ఎదుట ఆరోపించడం బలాన్ని చేకూరుస్తున్నాయి. కండువా కప్పుకుంటేనే దుకాణం.. లేదంటే ఉన్న పోస్టు ఊస్టేనంటూ ఓ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు బీఆర్ఎస్ కార్యకర్తలను బెదిరిస్తున్నట్టు తెలిసింది.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో 58 కొత్త రేషన్ డీలర్ పోస్టులకు 29న నోటిఫికేషన్ జారీచేశారు. పదో తరగతి ఉత్తీర్ణులైనవారు అర్హులు కాగా, 15న అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించారు. 830 మంది దరఖాస్తు చేసుకోగా, 765 మంది పరీక్షకు హాజరు హాజరయ్యారు. శనివారం సిరిసిల్ల ఆర్డీవో కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించారు. మార్కుల జాబితాను అధికారులు ప్రకటించలేదు. దీంతో అభ్యర్థులంతా ఆర్డీవో కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. పరీక్షలు రాసిన అభ్యర్థుల మార్కుల జాబితా బోర్డుపై ప్రదర్శించిన తర్వాతే ఇంటర్వ్యూలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. పేరుకే పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహించారని, పోస్టులన్నీ అమ్ముకున్నారంటూ ఓ కాంగ్రెస్ కార్యకర్త మీడియా ముందు వెల్లడించారు.
తన వద్ద అన్ని ఆధారాలున్నాయని, ఎవరికి డీలర్‌షిప్‌లు వస్తాయో కూడా తాను బయటపెడుతానని ముస్తాబాద్ మండలం పోతుగల్‌కు చెందిన కాంగ్రెస్ కార్యకర్త కావాటి మహిపాల్ స్పష్టం చేశారు. తమ ఊళ్లో ఒక ముదిరాజ్, వెలమ వర్గానికి చెందిన ఇద్దరు మహిళలకు పోస్టులు వచ్చాయన్న సమాచారం ఉన్నదని చెప్పారు. రిజల్ట్ తర్వాత తాను చెప్పిన పేర్లు ఉండకపోతే దేనికైనా సిద్ధమని సవాల్ విసిరారు.
ఇదేంటని ప్రశ్నిస్తే ‘నా ఇష్టం ఉన్నోళ్లకే ఇచ్చుకుంటానని, ఎస్సీలు, బీసీలకేనా? మా ఓసీలకు ఇచ్చుకోవద్దా? ఎక్కడ చెప్పుకుంటావో చెప్పుకో’ అంటూ తనను బెదిరించాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా గెలిస్తే ఇయ్యాళ ఇంకెన్ని సీట్లు అమ్ముకునేటోడివో’ అంటూ ఆరోపించారు. ‘టీఎస్పీఎస్సీలో అవినీతి జరిగిందని గతంలో రోడ్లెక్కి ధర్నాలు చేశాం. ఇప్పుడు కాంగ్రెసోళ్లే రేషన్ డీలర్ల సీట్లు అమ్ముకుంటుంటే మనం రోడ్లెక్కుదామా? బీఆర్ఎస్ వాళ్లను ఎక్కుమందామా? వాళ్లకు ఆధారాలు ఇద్దామా?’ అని కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు. ఆరోపణలపై ఏం స్పష్టత ఇస్తారో?
‘కండువా కప్పుకో.. దుకాణం నీకే ఇస్తా. లేదంటే నీ పోస్టు ఊస్ట్’ అని కేకే మహేందర్‌రెడ్డి తనను బెదిరించారని బీఆర్ఎస్ కార్యకర్త తాటి వెంకన్న మీడియా ఎదుట గోడు వెల్లబోసుకున్నారు. మహిళా సంఘాలకు ఇచ్చిన రేషన్ దుకాణం నడుపుకుంటున్న తాను బీఆర్ఎస్ కార్యకర్త కావడం పాపమా? అని ఆవేదన వ్యక్తంచేశారు. బీఆర్ఎస్కు చెందిన ఐదుగురి రేషన్ దుకాణాలకు నోటిఫికేషన్ జారీ చేసి, వారిస్థానంలో కొత్తవారిని నియమిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
రేషన్ దుకాణాల డీలర్‌షిప్‌లను ముందే అమ్ముకుని నామమాత్రంగా ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్, విప్ ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకుడు కేకే మహేందర్‌రెడ్డి వాళ్ల అనుచరులకు ముందే ఇచ్చి, పరీక్షలు నిర్వహించి, ఇంటర్యూల కథ నడిపిస్తున్నారంటూ విమర్శించారు. ఈ ఇంటర్వ్యూలు రద్దు చేసి మార్కుల జాబితా ప్రకటించిన తర్వాతే మళ్లీ పారదర్శకంగా ఇంటర్వ్యూలు నిర్వహించాలని ఆర్డీవోను కలిసి డిమాండ్ చేశారు.