హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ సర్కార్ హయాంలో సాదాబైనామా దరఖాస్తులకు ఇప్పటికైనా మోక్షం కలుగుతుందా? లేదా? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. సాదాబైనామాల పరిష్కారం కోసం భూభారతి చట్టంలో ప్రభుత్వం. ‘అమ్మకందారు అఫిడవిట్ ఇవ్వాలనే అనాలోచితమైన నిబంధన’ను పొందుపరిచింది. అయితే దీనిపై రైతుల నుంచి పెద్దఎత్తున విమర్శలు రావడం, దరఖాస్తులు ఎక్కడికక్కడే పేరుకుపోవడంతో తాజాగా ఆ నిబంధనను ఎత్తేస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇప్పుడు కేవలం కొనుగోలుదారు (కబ్జాలో ఉన్న వ్యక్తి) అఫిడవిట్ ఇస్తే సరిపోతుందని పేర్కొన్నది. 2014 జూన్ 2వ తేదీకి ముందు భూమి కొనుగోలుకు సంబంధించి ఒప్పందం జరిగి 2020 అక్టోబర్ 12 నుంచి నవంబర్ 10వ తేదీ వరకు చేసుకున్న దరఖాస్తులను పరిష్కరించాలని నిర్ణయించింది. అయితే, ఇప్పటికైనా దరఖాస్తులకు మోక్షం లభిస్తుందా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
గతంలో బీఆర్ఎస్ సర్కార్ సాదాబైనామాల దరఖాస్తులను పరిష్కరించి రైతులకు మేలు చేసింది. అయితే, రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంలేని కాంగ్రెస్ సర్కార్ భూభారతి చట్టంలో సాదాబైనామాల దరఖాస్తులకు అడ్డుకట్టవేసేలా అమలుకు సాధ్యంకాని నిబంధన పెట్టింది. దరఖాస్తు పరిష్కరించాలంటే ఆ భూమి అమ్మకందారు నుంచి అఫిడవిట్ తీసుకురావాలంటూ నిబంధన పొందుపరిచింది.
ఏండ్ల క్రితం తెల్లకాగితంపై ఒప్పందం ఆధారంగా కొనుగోలు చేసిన భూమికి సంబంధించి అమ్మకందారు ఇప్పుడెలా అఫిడవిట్ ఇస్తారని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇందులో గతంలో భూములు విక్రయించిన వారు కొంతమంది మరణించగా. మరికొంతమంది ఎక్కడెక్కడికో ఉన్నారు. ఒకవేళ అందుబాటులో ఉన్నప్పటికీ, అఫిడవిట్ ఇచ్చేందుకు అంగీకరించడంలేదని రైతులు చెప్తున్నారు. డబ్బులు డిమాండ్ చేస్తున్నారని, భూమిలో వాటాలు అడుగుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
సాదాబైనామాల కింద ప్రభుత్వానికి తొమ్మిది లక్షల దరఖాస్తులు అందాయి. పదుల సంఖ్యలో మాత్రమే దరఖాస్తులను పరిష్కరించారు. వీటి పరిష్కారానికి అమ్మకందారు అఫిడవిట్ నిబంధన అడ్డంగా మారింది. సాదాబైనామాల పరిష్కార బాధ్యత ఆర్డీవోలకు అప్పగించడమే కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్డీవోలు క్షేత్రస్థాయిలోదరఖాస్తులను పరిశీలించడంలేదని తెలిసింది.
ఎమ్మార్వో రిపోర్ట్‌పై ఆధారపడి ఆర్డీవోలు దరఖాస్తులను పరిష్కరిస్తున్నారని సమాచారం. ఎమ్మార్వోలు తప్పుడు నివేదికలు ఇస్తే, భవిష్యత్‌లో ఇబ్బంది అవుతుందనే ఆలోచనలో ఆర్డీవోలు ఉన్నారని తెలిసింది. దీంతో దరఖాస్తులను తిరస్కరిస్తున్నారని తెలిసింది. దరఖాస్తుల పరిష్కార బాధ్యత ఎమ్మార్వోలకే అప్పగించాలనే సూచనలొస్తున్నాయి.