మొబైల్ లేకుండా పూట గడవదు. ఫోన్ చూస్తూ ఉండడం వల్ల మెడ, భుజంలో ఉండే కండరాలపై ఒత్తిడి పెరుగుతుంది. అప్పుడు నొప్పి కలుగుతుంది. పనికి అసౌకర్యంగానూ ఉంటుంది. డెస్క్ ఉద్యోగాలు చేసేవాళ్లకు ఆ బాధ రెట్టింపు అవుతుంది. కదలకుండా కూర్చోవడం, కంప్యూటర్ చూస్తూ ఉండటం వల్ల నొప్పి మరింత తీవ్రమవుతుంది. ఈ స్థితిలో కాసేపు కంప్యూటర్, ఫోన్ పక్కన పెడతారు. ఆ సమయంలో కండరాలకు ఉపశమనం కలిగించే వ్యాయామం కూర్చున్న చోటే చేస్తూ ఉంటే ఎక్కువ ప్రయోజనం ఉంటుందని, భవిష్యత్లో స్పాండిలైటిస్ సమస్య వచ్చే ప్రమాదం కూడా తక్కువని ఫిట్నెస్ ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు.
అదెలా చేయాలంటే.. కుర్చీలో వెన్నెముక నిటారుగా ఉండేలా కూర్చోవాలి. మెడను పైకి, కిందికి వంచకుండా సూటిగా చూస్తూ ఉండాలి. తల పైకి, కిందికి వంచకుండా మెడను ముందుకు జరపాలి. మూడు నుంచి అయిదు సెకన్ల పాటు మెడను ముందుకు ఉంచిన తర్వాత నెమ్మదిగా వెనుకకు లాగాలి. వెనుకకు జరిపి.. మూడు నుంచి అయిదు సెకన్లు అలాగే ఉండాలి. ఇలా ముందుకు వెనక్కి రెండుసార్లు చేయాలి. రోజులో నాలుగు అయిదు సార్లు చేస్తే మెడ కండరాలకు ఉపశమనం కలుగుతుంది. మెడ పట్టేయడం, నొప్పి సమస్యలు రావు. అప్పటికే ఉన్నా కొంత ఉపశమనం లభిస్తుంది.