హైదరాబాద్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో పదో తరగతి వార్షిక పరీక్షలు మంగళవారం ముగిశాయి. చివరిరోజు సాంఘికశాస్త్రం పరీక్ష సజావుగా నిర్వహించారు. పరీక్షకు 4,86,194 మంది విద్యార్థులకుగాను, 4,84,384 మంది విద్యార్థులు (99.63శాతం) హాజరయ్యారు. ఇక ప్రైవేట్ విద్యార్థుల్లో 443 మందికి, 191 మందే పరీక్ష రాశారు. కాగా, జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియను ఈ నెల 13 నుంచి చేపట్టి, 21న ముగించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ ఏడాది 18 స్పాట్ వాల్యూయేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 11 మంది ఉన్నతాధికారులను రాష్ట్రస్థాయి పరిశీలకులుగా నియమించారు. ఈసారి మొత్తం తొమ్మిది రోజుల్లోనే మూల్యాంకనం ముగించనుండటం విశేషం. ఫలితాలను మే 10 తర్వాత విడుదల చేయనున్నారు. బుధవారం ఎస్సెస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ -1 (సంస్కృతం, అరబిక్), ఎస్సెస్సీ వొకేషనల్ కోర్సు (థియరీ) పరీక్షకు, గురువారం ఎస్సెస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ -2( సంస్కృతం, అరబిక్) పేపర్లకు పరీక్షలు నిర్వహిస్తారు.
16 మాల్ ప్రాక్టీస్ కేసులు
పరీక్షల ప్రారంభం నుంచి పూర్తయ్యే వరకు మొత్తం 16 మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదైనట్టు అధికారులు తెలిపారు. మంగళవారం ఒక్కరోజే మూడు కేసులు వచ్చినట్టు పేర్కొన్నారు. తెలుగు, హిందీ పరీక్షలు జరుగుతున్న సమయంలోనే ప్రశ్నపత్రాలు వాట్సాప్లో చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. ఈ విషయమై విధుల్లో నిరక్ష్యం వహించిన ముగ్గురు టీచర్లను డిస్మిస్ చేయగా, ఇద్దరు ఇన్విజిలేటర్లు, ఇద్దరు చీఫ్ సూపరింటెండెంట్లు, ఇద్దరు డిపార్ట్మెంటల్ అధికారులను సస్పెండ్ చేశారు. ముగ్గురు ఇన్విజిలేటర్లను, మరో ముగ్గురు చీఫ్ సూపరింటెండెంట్లను, ముగ్గురు డిపార్ట్మెంటల్ అధికారులను పరీక్షల విధుల నుంచి తప్పించారు. చివరి నాలుగు రోజులు పరీక్షలు సజావుగా ముగియడంతో అధికారులు ఊపిరిపీల్చుకొన్నారు.