యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ) : నేటి నుంచి మార్చి 3వ తేదీ వరకు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. మంగళవారం ఉదయం 10 గంటలకు స్వయంభూ నారసింహుడి అనుమతి తీసుకుని ప్రధానాలయ ముఖమండపంలో విశ్వక్సేనారాధన, స్వస్తివాచనం, రక్షాబంధనంతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. సాయంత్రం 6:30 గంటలకు మృత్యంగ్రహణం, అంకురారోపణం, వైదృశ్య కార్యక్రమాలు సాగనున్నాయి. ప్రధానాలయం పునఃప్రారంభం అనంతరం తొలిసారిగా బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. డోలు వాయిద్యాలు, సన్నాయి మేళాలు, వేద మంత్ర పఠనాలు, దేవతాహ్వానం, పారాయణాల అద్భుత ఘట్టాలతో ఆలయం మార్మోగనున్నది.
100 మంది రుత్వికులు, వేద పండితులు, పురోహితులు, అర్చకులు పాల్గొననున్నారు. ఇందుకోసం ఆలయ అధికారులు ప్రధానాలయాన్ని ముస్తాబు చేశారు. గతంలో ఎన్నడూలేని విధంగా అత్యధికంగా రూ.1.50 కోట్ల నిధులు కేటాయించారు. ప్రత్యేకంగా ఆలయ పరిసరాల్లో విద్యుద్దీపాలంకరణ, రంగురంగుల పూలతో ఆలయాన్ని సుందరీకరించారు. బ్రహ్మాండనాయకుడి బ్రహ్మోత్సవాలను కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. 27న ఎదుర్కోలు, 28న సాయంత్రం తిరుకల్యాణోత్సవం, మార్చి 1న రథోత్సవం, 2న చక్రతీర్థ స్నానం, 3వ తేదీన శతఘటాభిషేకం, డోలోత్సవాలతో ఉత్సవాలకు పరిసమాప్తి పలుకనున్నారు. బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ విభాగాలకు చెందిన రాష్ట్రస్థాయి అధికారులు, ఐఏఎస్, ఐపీఎస్‌లతో పాటు అన్ని విభాగాలకు చెందిన అధికారులకు ఆలయ అధికారులు ఆహ్వానం పలికారు.
స్వామివారి ప్రధానాలయంతో పాటు చుట్టూ ఆలయ ప్రాంగణమంతా రంగురంగుల విద్యుద్దీపాలంకరణతో స్వామివారి ఆలయం ఉత్సవ శోభను సంతరించుకున్నది. స్వామివారి సేవలకు వినియోగించే వాహనాలను సిద్ధం చేశారు. ప్రధానాలయాన్ని పూర్తిగా నీటితో శుద్ధి చేసి రంగురంగుల పూలతో అలకంరించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా వివిధ పూజా కైంకర్యాలు చేపట్టేందుకు ప్రధానాలయ ముఖమండపం, వెలుపలి ప్రాకార మండపంలోని అద్దాల మండపం ఎదురుగా యాగశాలను ఏర్పాటు చేశారు. వేసవి కాలం ప్రారంభం కావడంతో భక్తులకు అసౌకర్యాలు కలుగకుండా చలువ పందిళ్లు, తాగునీటి వసతులను కల్పించారు. స్వామివారి ఆలయాన్ని మామిడి తోరణాలు, వివిధ రకాల పూలతో అలంకరించారు. బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు ప్రతిధ్వనించేలా ప్రత్యేకమైన సౌండ్ సిస్టం ఏర్పాటు చేశారు.