హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): ఇప్పటికే శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా కృష్ణా జలాలను దోచుకెళ్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. వెలిగొండ ద్వారా మరో 43 టీఎంసీలు కొల్లగొట్టేందుకు సిద్ధమైంది. వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభానికి సన్నాహాలు చేస్తున్నది. నీటి కేటాయింపులు లేకున్నా, కృష్ణా బేసిన్లో ప్రాజెక్టులు నిండకపోయినా, వరద రాకున్నా దొడ్డిదారిన మళ్లించేందుకు ముమ్మర కసరత్తు చేస్తున్నది. తెలంగాణకు తీరని జల ద్రోహానికి ఒడిగడుతున్నది. నిబంధనలను కాలరాస్తూ ఆంధ్రప్రదేశ్ సర్కార్ నీళ్లు తీసుకెళ్లేందుకు యత్నిస్తుంటే, రేవంత్ సర్కార్ నిద్రమత్తులో జోగుతున్నది. అక్రమ తరలింపును అడ్డుకోకుండా నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నది.
ప్రాజెక్టు ప్రారంభానికి సన్నాహాలు
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ కడప జిల్లాల్లో 4.38 లక్షల ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతో ‘పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు’ కోసం 1994లో డీపీఆర్‌ను సిద్ధంచేశారు. ఆ తర్వాత 2005 ఆగస్టులో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం జలయజ్ఞంలో భాగంగా ప్రాజెక్టుకు పరిపాలనాపరమైన అనుమతులు మంజూరు చేసి పనులు ప్రారంభించింది. కృష్ణాలో వరద కొనసాగుతున్న సమయంలో శ్రీశైలం రిజర్వాయర్ 841 అడుగుల వద్ద బ్యాక్‌వాటర్ నుంచే 43 టీఎంసీలను తరలించడం ఈ ప్రాజెక్టు ఉద్దేశం. ఇందుకోసం కొల్లంవాగుపై ఇన్‌టేక్ పాయింట్ హెడ్ రెగ్యులేటరీని నిర్మించారు. అప్రోచ్ చానల్ ద్వారా జంట సొరంగాలకు, అక్కడినుంచి ఫీడర్ చానల్‌కు, ఆపై ప్రకాశం జిల్లాలో 53 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన నల్లమలసాగర్‌కు కృష్ణా జలాలు తరలిస్తారు. అకడినుంచి కాలువలకు మళ్లించి నీరందిస్తారు. ఇప్పటికే పనులు పూర్తికాగా ఈ సీజన్లోనే ప్రారంభించేందుకు ఏపీ సర్కార్ చకచకా సన్నాహాలు చేస్తున్నది.
ఇష్టారాజ్యంగా విస్తరణ
బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం కృష్ణా జలాలను తొలుత బేసిన్అవసరాలకే వినియోగించాలి. అక్కడి తాగు, సాగునీటి అవసరాలకే ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ, ఉమ్మడి పాలకులు అందుకు విరుద్ధంగా కృష్ణా బేసిన్ ఆవల, పెన్నా బేసిన్‌కు మళ్లించేలా వెలిగొండకు అంకురార్పణ చేశారు. తొలుత 3,200 క్యూసెకులతోనే చేపడుతామని చెప్పారు. తర్వాత ఇష్టారాజ్యంగా విస్తరించారు. శ్రీశైలం నుంచి జలాలను మళ్లించే జంట సొరంగాల గరిష్ఠసామర్థ్యం 17,000 క్యూసెకులను మళ్లించేలా రూపొందించారు. ప్రాజెక్టుకు అనుబంధంగా అనేక నిర్మాణాలు చేపట్టారు. దీంతో రిజర్వాయర్ 841 అడుగుల నుంచే నీటిని మళ్ల్లించేందుకు ఏపీకి అవకాశం ఏర్పడింది.
పేరుకే 43 టీఎంసీలు
వెలిగొండ ప్రాజెక్టు ద్వారా 43 టీఎంసీలు మాత్రమే తరలిస్తామని ఏపీ చెప్తున్నది. ఆచరణలో అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. ఇందులోభాగంగా పలు రిజర్వాయర్లను తెరపైకి తెచ్చింది. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి తొలుత ప్రకాశం జిల్లాలోని నల్లమలసాగర్‌కు నీళ్లు తరలిస్తున్నది. వాస్తవంగా గుట్టల మధ్య ఖాళీలను సుంకేసుల, గొట్టిపడియా, కాకర్ల ప్రాంతాలను కలుపుతూ నల్లమలసాగర్‌ను 53 టీఎంసీల పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం, 43 టీఎంసీల లైవ్ స్టోరేజీ సామర్థ్యంతో నిర్మించారు.
అంటే డెడ్‌స్టోరేజీ 10 టీఎంసీలుగా నిర్ధారించారు. ఆజలాలను వినియోగించుకొనేందుకు ఏపీ అదనపునిర్మాణాలను చేపట్టింది. ఇక నల్లమలసాగర్ నుంచే నీటినితరలించేందుకు మూడు బ్రాంచ్ కెనాల్స్ ఉంటాయి. తీగలేరు,గొట్టిపడియా కాలువ, ఈస్ట్రన్ మెయిన్‌కెనాల్ ఉంటుంది. ఈ కెనాల్‌పై పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్‌ను 1.7 టీఎంసీలతో నిర్మించాల్సి ఉండగా, 2 టీఎంసీలతో నిర్మించింది. ఈస్ట్రన్ మెయిన్ కెనాల్‌కు అనుబంధంగా వెస్ట్రన్ బ్రాంచ్ కెనాల్‌ను చేపట్టింది. ఈ కెనాల్ కనెక్టివిటీ సిస్టమ్‌లో తురిమెళ్ల, రాచర్ల, సీతారామసాగర్, రాళ్లవాగు, గుండ్లబ్రహ్మేశ్వరం రిజర్వాయర్లను నిర్మించింది. వందలాది చెరువులను సైతం లింక్ చేసింది.
నాడు ద్రోహం.. నేడు చోద్యం
శ్రీశైలం రిజర్వాయర్‌కు కుడివైపు వెలిగొండ, ఎడమవైపు తెలంగాణకు చెందిన ఎస్ఎల్బీసీని ఒకేసారి ప్రారంభించారు. వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించిన వరదను 30 రోజులకే లెకగట్టి డిజైన్ చేసింది. అందుకు అనుగుణంగా 2 సొరంగాలు ఒక టన్నెల్ 7 మీటర్ల వ్యాసం, మరొకటి 9.2 మీటర్ల వ్యాసంతో 18.8 కిలోమీటర్ల పొడవుతో నిర్మించేందుకు సిద్ధమైంది. టన్నెళ్లను టన్నెల్ బోరింగ్ మిషన్ టెక్నాలజీతో చేపట్టింది. కానీ, తెలంగాణకు సంబంధించి ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుకు వరదరోజులను 90గా లెక గట్టి డిజైన్ చేసి నాటి కాంగ్రెస్ ప్రభుత్వమే ద్రోహం చేసింది. ఒకేరిజర్వాయర్, ఒకే నదిపై రెండు ప్రాజెక్టులకు వేర్వేరుగా వరద రోజులను లెకగట్టడం చరిత్రలోనే ఎకడా లేదు. వెలిగొండ ప్రాజెక్టు నీటిసామర్థ్య లక్ష్యం 17,000 క్యూసెకులు కాగా, ఎస్ఎల్బీసీ సొరంగం నీటి తరలింపు సామర్థ్యం 4,000 క్యూసెకులే. ఈ విధంగా తెలంగాణకు పూర్తిగా ద్రోహం తలపెట్టింది. నేడు కూడా కాంగ్రెస్ మళ్లీ తీరని విద్రోహాన్ని తలపెడుతున్నది. అనుమతులు లేకున్నా, వరద రాకున్నా వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించి నీళ్లు ఎత్తుకెళ్లేందుకు ఏపీ సన్నాహాలు చేస్తుంటే, నిలువరించాల్సిన రేవంత్ సర్కార్ చేష్టలుడిగి చూస్తున్నది.
వరద లేకుండానే తరలింపు?
శ్రీశైలం నుంచి తెలుగుగంగ ప్రాజెక్టుకు 15 టీఎంసీలు, శ్రీశైలం కుడి కాలువ (ఎస్ఆర్బీసీ) 19 టీఎంసీలు మొత్తంగా 34 టీఎంసీలు మళ్లించుకొనేందుకు ఏపీకి అనుమతి ఉన్నది. కానీ, వరద జలాల పేరిట హెచ్ఎస్ఎస్ఎస్ (హంద్రీ-నీవా సుజల స్రవంతి), జీఎన్ఎస్ఎస్ (గాలేరు-నగరి సుజల స్రవంతి), మల్యాల, ముచ్చుమర్రి ఇతరత్రా లిఫ్ట్‌ల ద్వారా ఇప్పటికే కేటాయింపునకు మించి జలాలను తరలిస్తున్నది. వెలిగొండ నుంచి సైతం నీళ్లు మళ్లీంచేందుకు సిద్ధమవుతున్నది. వెలిగొండ ప్రాజెక్టును సైతం వరద జలాల ఆధారంగా చేపట్టారు. కృష్ణా బేసిన్లో ప్రాజెక్టులన్నీ నిండి, సముద్రానికి వృథాగా పోయే సమయంలో 30 రోజుల్లో 43 టీఎంసీలను తరలిస్తామని చెప్పి నాడు ఈ రిజర్వాయర్‌ను తెరపైకి తెచ్చారు. కానీ, ప్రస్తుతం కృష్ణాబేసిన్‌లో సాధారణం కంటే 45% లోటు వర్షపాతం నమోదైంది. వానకాలం ప్రారంభమై మూడు నెలలైనా ప్రాజెక్టులు పూర్తిగా నిండలేదు. కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టుల్లో 152 టీఎంసీల లోటు ఉన్నది. ఇవేమీ పట్టని ఏపీ ప్రభుత్వం తెలంగాణకు గండి కొడుతూ ఆంధ్రాకు అక్రమంగా నీళ్లు తరలించేందుకు యత్నిస్తున్నది.