హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ వర్సిటీ ప్రవేశాల్లో కూలీల పిల్లలకు 15% సీట్లు కేటాయించడం హర్షణీయమని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పేర్కొన్నారు. సోమవారం లోక్‌భవన్‌లో జిష్ణుదేవ్‌వర్మను వ్యవసాయ వర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా పీజేటీఏయూ రూపొందించిన ప్రగతి నివేదికను జిష్ణుదేవ్‌వర్మ ఆవిష్కరించారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం సాధిస్తున్న ప్రగతిని ఆయన అభినందించారు.
ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకు ల్లో వ్యవసాయ వర్సిటీ 37వ ర్యాంకు నుంచి 24వ స్థానానికి చేరుకోవడం పట్ల హర్షం వ్యక్తంచేశారు. అనంతరం పెండింగ్‌లోని మూడు బ్యాచ్‌లకు కలిపి ఒకే స్నాతకోత్సవాన్ని 2026 ఫిబ్రవరిలో నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలని వీసీ అల్దాస్ జానయ్య విజ్ఞప్తి చేయగా అంగీకరించారు. గవర్నర్‌ను కలిసిన వారిలో వర్సిటీ రిజిస్ట్రార్ జీఈసీహెచ్ విద్యాసాగర్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్ ఎం మల్లారెడ్డి తదితరులు ఉన్నారు.