సిద్దిపేట స్టాఫ్ ఫొటోగ్రాఫర్ : హరితహారంపై అధికారుల నిర్లక్ష్యం వల్ల పర్యావరణ పరిరక్షణ లక్ష్యం నీరుగారుతున్నది. నాటిన మొక్కలను సంరక్షించడం మరిచి ఉన్న చెట్లను నరుకుతూ లక్ష్యానికి తూట్లు పొడుస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో సిద్దిపేట పట్టణంలో విరివిగా మొక్కలు నాటి సంరక్షించారు. ఆ మొక్కలు ఏపుగా పెరిగి నీడను, గాలిని, ఆహ్లాదాన్ని పంచుతున్నాయి.
ఇప్పుడాచెట్లు కరెంట్ వైర్లకు అడ్డొస్తున్నాయని విద్యుత్తు అధికారులు మున్సిపల్ సిబ్బందితో కలిసి ఇష్టారాజ్యంగా మిషన్లతో నరికేస్తున్నారు. కొమ్మలను తొలిగించాల్సి ఉండగా.. ఏకంగా చెట్లనే మొదలు వరకు తొలగిస్తున్నారు. మరోవైపు వనమహోత్సవం పేరిట మొక్కలు నాటుతున్నారు. గతంలో నాటిన మొక్కల సంరక్షణను గాలికొదిలేసి ఇప్పుడు మళ్లీ మొక్కలు నాటే అధికార యంత్రాంగంపై సర్వత్రా విమర్శలొస్తున్నాయి.