బడ్జెట్లో సాగుకు కేటాయింపులు
2021-22 3.90%
2022-23 3.51%
2023-24 2.92 %
హైదరాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): బీజేపీ పాలనలో దేశ వ్యవసాయరంగం కుదేలవుతున్నది. వ్యవసాయ, అనుబంధ రంగాల్లో వృద్ధిరేటు నానాటికీ దారుణంగా దిగజారుతుండటమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. 2019-20 ఆర్థిక సంవత్సరంలో 6.2 శాతంగా ఉన్న ఈ వృద్ధిరేటు 2022-23లో 3.3 శాతానికి పడిపోయింది. అంటే నాలుగేండ్లలోనే వృద్ధిరేటు 2.9% తగ్గింది. ఇవేమీ కాకి లెక్కలు కావు. నిండు పార్లమెంట్లో సాక్షాత్తు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ వెల్లడించిన వివరాలు. బీజేపీ ఎంపీ సిసిర్ కుమార్ అధికారి అడిగిన ప్రశ్నకు ఆయన లిఖిత పూర్వకంగా ఈ వివరాలను తెలియజేశారు. పాలకులు ప్రత్యేకంగా దృష్టి సారిస్తేనే ఏ రంగమైనా అభివృద్ధి పథంలో పయనిస్తుంది. కానీ దేశ సంపదను అడ్డగోలుగా కార్పొరేట్లకు దోచిపెట్టడమే పరమావధిగా పెట్టుకున్న నరేంద్రమోదీ సర్కారు.. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. అందుకే ఆ రంగంలో వృద్ధిరేటు నానాటికీ క్షీణిస్తున్నది. 2019-20లో 6.2 శాతంగా నమోదైన వ్యవసాయరంగ వృద్ధిరేటు.. 2020-21లో 4.1 శాతానికి, 2021-22లో 3.5 శాతానికి, 2022-23లో 3.3 శాతానికి దిగజారింది. దీనిపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది.
వ్యవసాయరంగానికి సంబంధించి మరో కీలక నిజాన్ని కూడా కేంద్ర మంత్రి బయటపెట్టారు. గత మూడేళ్లుగా వ్యవసాయ, అనుంబంధరంగాలకు బడ్జెట్లో కోత పెడుతున్నట్టు ఆయన వెల్లడించారు. 2021-22లో ఈ రంగానికి బడ్జెట్లో 3.90% నిధులను కేటాయించిన కేంద్ర ప్రభుత్వం.. 2022-23 బడ్జెట్లో ఈ కేటాయింపులను 3.51 శాతానికి, 2023-24 బడ్జెట్లో 2.92 శాతానికి కుదించినట్టు వివరించారు. దేశానికి వెన్నెముక లాంటి వ్యవసాయ రంగానికి మోదీ సర్కారు బడ్జెట్లో కేటాయింపులను పెంచకపోగా ఏటికేడు తగ్గిస్తుండటం గమనార్హం.
ఈ పరిణామాలతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ వ్యవసాయరంగాన్ని పూర్తిగా గాలికొదిలేసిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మోదీ సర్కారు రైతులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వ్యవసాయరంగం, రైతులకు సంబంధించి కేంద్రం తీసుకుంటున్న పలు నిర్ణయాలు, చర్యలు ఈ ఆరోపణలకు మరింత బలం చేకూరుస్తున్నాయి. బడ్జెట్లో నిధుల కేటాయింపు తగ్గించడం.. మద్దతు ధరపై భరోసా ఇవ్వకపోవడం.. రైతుల నుంచి పంటలను పూర్తిగా కొనుగోలు చేయకపోవడం.. కోట్ల మంది రైతులు ముక్తకంఠంతో వ్యతిరేకించినప్పటికీ 3 కొత్త వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చి, రద్దు చేయడం.. ఎరువుల ధరలను పెంచడం.. వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టించడం లాంటి చర్యలే ఇందుకు కారణం. ఇది చాలదన్నట్టు దేశ వ్యవసాయరంగాన్ని కార్పొరేట్ శక్తుల గుప్పిట్లో పెట్టి రైతులను కూలీలుగా మార్చేందుకు మోదీ సర్కారు కుట్ర చేస్తుండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలతో దేశ వ్యవసాయరంగం కుదేలవుతుంటే.. అదే సమయంలో తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రభుత్వ రైతు పక్షపాత విధానాల వల్ల రాష్ట్రంలో వ్యవసాయరంగ వృద్ధిరేటు పరుగులు పెడుతున్నది. దేశ వృద్ధిరేటు కంటే ఎంతో అధికంగా నమోదవుతున్నది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో 12.7 శాతంగా ఉన్న రాష్ట్ర వ్యవసాయ వృద్ధిరేటు.. 2019-20లో రికార్డు స్థాయిలో 37.1 శాతానికి పెరిగింది. ఆ తర్వాత 2020-21లో 13.3%, 2021-22లో 9.7%, 2022-23లో 11.9% వృద్ధిరేటు నమోదైంది. తెలంగాణలో వ్యవసాయానికి నిరంతరం ఉచితంగా విద్యుత్తును అందజేయడంతోపాటు కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ, రైతుబంధు తదితర సంక్షేమ పథకాల వల్లనే రాష్ట్రంలో వ్యవసాయరంగం దేదీప్యమానంగా వెలుగొందుతున్నది.