హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంపై ఎల్ నినో తీవ్ర ప్రభావం కరువు పరిస్థితులకు దారి తీస్తున్నదని వ్యవసాయ శాఖ ఆందోళన వ్యక్తంచేసింది. రాష్ట్రంలోని 8,831 గ్రామాలపై ఎల్ నినో ప్రభావం తీవ్రంగా ఉండబోతున్నదని హెచ్చరించింది. మరో 2,298 గ్రామాలపై తక్కువ ప్రభావం ఉంటుందని అంచనా వేసింది. వర్షాభావ పరిస్థితులను సమర్థంగా ఎదురొనే లక్ష్యంతో రూపొందించిన ‘ఎల్ నినో కంటింజెన్సీ ప్లాన్- 2026’ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురువారం సచివాలయంలో విడుదల చేశారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 45.49% పంటల సాగు నమోదైనట్టు నివేదిక పేర్కొన్నది. గత సంవత్సరం ఇదే సమయానికి 58.73 లక్షల ఎకరాల్లో పంటలు సాగు కాగా. ప్రస్తుతం 60.22 లక్షల ఎకరాల్లో సాగైనట్టు వెల్లడించింది.. ఇందులో వరి కేవలం 9.67 శాతమే సాగైనట్టు తెలిపింది. వరి సాధారణ సాగు విస్తీర్ణం 65.95 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు కేవలం 6.37 లక్షల ఎకరాల్లోనే సాగైనట్టు పేర్కొన్నది.
ఇప్పటివరకు రాష్ట్రంలో 30.53% లోటు వర్షపాతం నమోదైనట్టు నివేదికలో వెల్లడించింది. 27 జిల్లాల్లో లోటు వర్షపాతం ఉండగా, ఐదు జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైందని తెలిపింది. జూలైలో 25% లోటు వర్షపాతం నమోదు కాగా, ఆగస్టులో 10%-15%, సెప్టెంబర్లో 42%, అక్టోబర్ నాటికి 55% లోటు వర్షపాతం నమోదవుతుందని అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణను నార్త్, సౌత్, సెంట్రల్ జోన్లుగా విభజించి పంటల సాగును సూచించింది. వరి సాగు చేయొద్దని.. కంది, జొన్న, మక్కజొన్న, సోయా, పెసర్ల వంటి పంటలు సాగు చేయాలని సూచించింది. ఎల్ నినో సవాళ్లను కలిసికట్టుగా ఎదురొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. బోర్లపై ఆధారపడి వరి సాగు చేయడం ప్రస్తుతం అనుకూలం కాదని, తకువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలు, ఉద్యాన పంటలు, కూరగాయల సాగుపై రైతులు దృష్టి సారించాలని సూచించారు. కంటింజెన్సీ ప్లాన్ను జిల్లా కలెక్టర్లు అత్యంత పకడ్బందీగా అమలు చేయాలని, గ్రామస్థాయి వరకు విసృ్తతంగా తీసుకెళ్లి ప్రతి రైతుకు సవివరంగా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.
సరైన సమయంలో సరైన సలహాలు అందించడం అత్యంత కీలకమని పేర్కొన్నారు. రాష్ర్టాన్ని భౌగోళిక, వాతావరణ, నేలల స్వభావం ఆధారంగా మూడు వ్యవసాయ ప్రాంతాలుగా విభజించి, ఆయా ప్రాంతాల ప్రత్యేక పరిస్థితులకు అనుగుణంగా కంటింజెన్సీ ప్రణాళిక రూపొందించామని వివరించారు. ప్రతి జిల్లా, ప్రతి మండలానికి సంబంధించిన వర్షపాతం పరిస్థితులు, రానున్న రెండు నుంచి మూడు వారాల వాతావరణ అంచనాలు, భారత వాతావరణ శాఖ వారపు సూచనలను ఇందులో పొందుపరిచినట్టు తెలిపారు. రైతులు ఇప్పటికే సాగు చేసిన పంటలను కాపాడుకొనే చర్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
రైతుల్లో కూడా వర్షాలపై ఆశలు తగ్గుతున్న నేపథ్యంలో, ప్రత్యామ్నాయ పంటలపై నిర్ణయం తీసుకొనేందుకు ఇదే సరైన సమయమని పేరొన్నారు. అనంతరం మంత్రి తుమ్మల తెలంగాణ సహకార రంగం పనితీరుపై అధ్యయనం చేసేందుకు వచ్చిన ఇరాన్ ప్రతినిధి బృందంతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో సహకార ఉద్యమం బలోపేతానికి ప్రభుత్వం చేపట్టిన చర్యలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పనితీరు, సభ్యత్వ విస్తరణ, రైతులకు అందిస్తున్న సేవలు, సహకార రంగంలో రాష్ట్రం సాధించిన పురోగతిని ప్రతినిధి బృందానికి వివరించారు.
వానకాలం ప్రారంభమై 45 రోజులు గడుస్తున్నా.. వరుణుడు ముఖం చాటేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. విత్తనాలు మొలకెత్తినా నీటి తడులు అందక ఎండుముఖం పట్టాయి. ఎండుతున్న పంటలను చూసి తల్లడిల్లిన నారాయణపేట జిల్లా మక్తల్ శివారులో రైతు ఆనంద్ గురువారం బోరు డ్రిల్లింగ్ చేయించాడు. అప్పు చేసి పొలంలో బోరు వేయించినా కొద్దిపాటి నీళ్లు మాత్రమే పడటంతో ఆందోళనకు గురయ్యాడు.
– మక్తల్