హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు కల్పించిన 42% రిజర్వేషన్లు అమలవుతాయా? మళ్లీ అటకెక్కుతాయా? అని రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొన్నది. ప్రస్తుతం ఖరారు చేసిన రిజర్వేషన్లను హైకోర్టు కానీ, సుప్రీంకోర్టు కానీ కొట్టివేస్తే పరిస్థితి ఏమిటి? షెడ్యూల్ ప్రకారమే కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తుందా? మరి ఎన్నికలను నిర్వహిస్తే బీసీలకు 23 శాతమైనా సీట్లు దక్కుతాయా? డెడికేటెడ్ కమిషన్ నివేదికను మరోసారి సవరించి తెప్పించుకోవాల్సి ఉంటుందా? అని రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో, ఆశావాహ అభ్యర్థుల్లో, సామాన్యుల్లో జోరుగా చర్చ జరుగుతున్నది. కోర్టు తీర్పులు ఏలా ఉండబోతున్నాయి, ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటాయనే అంశాలపై అందరూ అంచనాలు వేసుకుంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లు కల్పిస్తున్నారు. బీసీలకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలే ఇష్టారీతిన రిజర్వేషన్లను కల్పిస్తూ వస్తున్నాయి.
లాటరీ పద్ధతి, ర్యాండమ్‌గా ఎంపిక చేయడం తదితర అశాస్త్రీయమైన పద్ధతుల్లో బీసీలకు రిజర్వేషన్లను కల్పించడం, వాటిపై న్యాయవివాదాలు తలెత్తడం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలోనే ఓబీసీలకు అమలు చేస్తున్న రిజర్వేషన్లపై కర్నాటకకు చెందిన కేఈ కృష్ణమూర్తి, మహారాష్ట్రకు చెందిన వికాస్‌రావు గవాళి కేసులో సుప్రీంకోర్టు పలు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ట్రిపుల్ టీ పేరిట పలు మార్గదర్శకాలను కోర్టు జారీచేసింది. మొదటిది.. ప్రతీ స్థానిక సంస్థల్లో ఓబీసీ రిజర్వేషన్ల అమలు, ఫలితాలపై అధ్యయనం చేసేందుకు పూర్తిస్థాయి రాజ్యాంగ బద్ధమైన, డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలి. రెండోది.. జనాభా నిష్పత్తికి అనుగుణంగా రిజర్వేషన్లను స్థిరీకరించాలి. మూడోది.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు కలిపి మొత్తంగా 50 శాతానికి మించకూడదు. ఈ ట్రిపుల్ టీ మార్గదర్శకాలను పాటించని ఏ రాష్ట్రంలో కూడా స్థానికసంస్థల ఎన్నికల్లో ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేయకూడదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఈ నిబంధనలను పాటించకుండా పలు రాష్ర్టాల్లో జరిగిన స్థానికసంస్థల ఎన్నికలను సుప్రీంకోర్టు రద్దు చేసింది.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా స్థానిక రిజర్వేషన్లను ఖరారు చేసింది. బీసీలకు 42%, ఎస్సీలకు 15%, ఎస్టీలకు 10% రిజర్వేషన్లు.. మొత్తంగా 67% రిజర్వేషన్లను కల్పించింది. ఇది రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు విధించిన 50% సీలింగ్‌ను మించిపోతున్నది. పైగా రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లులు గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉండగానే ప్రభుత్వం వాటి అమలు కోసం జీవోను విడుదల చేసింది. ఇలా ఎటుచూసినా ఈ రిజర్వేషన్లు కోర్టులో నిలబడవని న్యాయకోవిదులు స్పష్టంగా తేల్చిచెప్తున్నారు. మరోవైపు బీసీలకు కల్పించిన 42% రిజర్వేషన్లను సవాల్ చేస్తూ ఇప్పటికే పలువురు హైకోర్టును, సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 243-డీ(6), 243-టీ(6) ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్న అధికారాన్ని వినియోగించి తెలంగాణ ప్రభుత్వం బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్‌ను కల్పించింది. ఈ మేరకు గవర్నర్ పేరిట బీసీ సంక్షేమశాఖ ఇటీవల జీవో-9ని జారీచేసింది. దీనికి అనుగుణంగా జడ్పీ చైర్పర్సన్ స్థానాలకు పంచాయతీరాజ్ కమిషనర్, జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలకు జిల్లా కలెక్టర్లు, ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాలకు ఆర్డీవోలు, వార్డు సభ్యుల స్థానాలకు ఎంపీడీవోలు రిజర్వేషన్లను ఖరారు చేశారు. ఎన్నికల షెడ్యూల్‌ను కూడా ప్రకటించారు. అయితే జీవో-9ను సవాల్ చేస్తూ పలువురు కోర్టును ఆశ్రయించారు. దీంతో ప్రస్తుతం కల్పించిన రిజర్వేషన్లు మారుతాయా? మొత్తం రిజర్వేషన్లే రద్దవుతాయా? అనే చర్చ కొనసాగుతున్నది. జీవో 9ని కోర్టులు కొట్టేస్తే రిజర్వేషన్లన్నీ రద్దవుతాయని న్యాయకోవిదులు, పలువురు ఉన్నతాధికారులు ఘంటాపథంగా చెప్తున్నారు. అప్పుడు కొత్తగా మళ్లీ రిజర్వేషన్లను ఖరారు చేయాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు.
42% రిజర్వేషన్లను కోర్టులు రద్దు చేస్తే ఏం జరుగుతుంది? 50% సీలింగ్‌కు లోబడి బీసీలకు గతంలో కల్పించిన మేరకైనా రిజర్వేషన్లు ఉంటాయా? అన్న చర్చ జరుగుతున్నది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓబీసీ రిజర్వేషన్ల స్థిరీకరణ, అమలు, ఫలితాలపై అధ్యయనం కోసం ప్రతిసారి డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు తప్పనిసరి. కమిషన్ సిఫారసులు లేకుంటే బీసీ రిజర్వేషన్ స్థానాలన్నింటినీ జనరల్ స్థానాలుగానే మార్చే ప్రమాదం ఉంటుంది. దీనికి అనుగుణంగానే 2018, 2019లో స్థానిక సంస్థల ఎన్నికల్లో 2011 జనాభా లెక్కల ఆధారంగా రిజర్వేషన్లను కల్పించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం బూసాని వెంకటేశ్వర్లు నేతృత్వంలో డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పాటుచేసింది. ఆ కమిషన్ ఇటీవల నిర్వహించిన ఇంటింటి సర్వే గణాంకాల ఆధారంగా స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని సిఫారసు చేసింది. దీనికి అనుగుణంగానే ప్రభుత్వం జీవో-9ని జారీచేసింది. ఒకవేళ జీవో-9ని కోర్టు రద్దు చేస్తే బీసీల రిజర్వేషన్లు రద్దువుతాయి. అప్పుడు సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం మరోసారి డెడికేటెడ్ కమిషన్ నుంచి నివేదిక తెప్పించుకోవాల్సి ఉంటుందని న్యాయకోవిదులు చెప్తున్నారు. లేదంటే 23% దక్కడం కూడా అసాధ్యమని, అన్నీ జనరల్ స్థానాలుగా మారే ప్రమాదం ఉన్నదని హెచ్చరిస్తున్నారు. మరోవైపు సీలింగ్‌కు లోబడి కూడా కమిషన్ ఇప్పటికే నివేదికను సిద్ధం చేయడంతోపాటు ప్రభుత్వానికి సమర్పించిందని విశ్వసనీయ వర్గాల సమాచారం.
బీసీలకు 42% రిజర్వేషన్లకు కోర్టు అడ్డుపడే సూచనలు ఉన్నాయని, రిజర్వేషన్ పెంపు అమలు కాకపోవచ్చని ప్రభుత్వ పెద్దలు కూడా ఓ నిర్ణయానికి వచ్చినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇటీవల ముఖ్యమంత్రి సహచర మంత్రులతో ఈ అంశంపై చర్చించారని కూడా తెలిసింది. కేసీఆర్ ప్రభుత్వం అనుసరించిన బీసీ రిజర్వేషన్లనే మనం కూడా అమలు చేయక తప్పదని ఆ సందర్భంగా మంత్రులు స్పష్టం చేసినట్టు సమాచారం. హామీలు అమలు కాలేదని ప్రజల్లో వ్యతిరేకత ఉన్నదని, యూరియా కొరతతో రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని సీఎం దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్తున్నారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌లో అదనంగా తులం బంగారం, మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థికసాయం, నిరుద్యోగ భృతి వంటి అనేక హామీలు అమలు కాలేదని గుర్తు చేశారట.
ప్రస్తుతం యూరియా గొడవ తగ్గిందని, ఎన్నికలకు వెళ్లడానికి ఇదే సరైన సమయం అని మంత్రులకు సీఎం సర్దిచెప్పినట్టు సమాచారం. ఇంకా ఆలస్యం చేస్తే కొత్త సమస్యలు వస్తాయని ఆందోళన వ్యక్తంచేసినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. నవంబర్ మూడో వారం నుంచి సన్నాలు కల్లాల మీదికి వస్తాయని, ధాన్యం కొనుగోళ్లు, వాటికి బోనస్ ఇవ్వడం ఆషామాషీ వ్యవహారం కాదని సీఎం అన్నట్టు సమాచారం. మరోవైపు రబీ సీజన్ వస్తుందని, అప్పుడు రైతుభరోసా అడుగుతారని, డబ్బులు ఇవ్వకపోతే, యూరియా కష్టాలు, సన్నాల బోనస్, రైతు భరోసా.. ఇలా ప్రతి కష్టాన్ని గుర్తుకు తెచ్చుకొని రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారుతారని రేవంత్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేసినట్టు విశ్వసనీయ సమాచారం. అందుకే ఏదేమైనా అక్టోబర్‌లోనే ఎన్నికలకు వెళ్లాలని సీఎం తేల్చి చెప్పినట్టు తెలిసింది.