Telangana Decade Celebrations | హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా 21 రోజులపాటు వైభవంగా జరిగిన దశాబ్ది ఉత్సవాలు అంతే ఘనంగా ముగిశాయి. సీఎం కేసీఆర్ తొమ్మిదేండ్ల పాలనలో జరిగిన అభివృద్ధి, అమలైన సంక్షేమ పథకాలను ఈ సంబురాలు కండ్ల ముందుంచాయి. అభివృద్ధిలో దూసుకెళ్తూ దేశానికి రోల్‌మాడల్‌గా నిలిచిన వైనాన్ని గుర్తుచేశాయి. గురువారం కేసీఆర్ చేతుల మీదుగా అమరవీరుల స్మారకం ఆవిషరణతో వేడుకలు ముగిశాయి.
రాష్ట్ర సాధనకు ప్రాణాలను సైతం లెకచేయకుండా పోరాడిన అమరులకు సీఎం కేసీఆర్ గన్‌పార్క్‌లో నివాళి అర్పించి రాష్ర్టావతరణ దశాబ్ది ఉత్సవాలను ప్రారంభించారు. అమరుల కుటుంబాలకు తెలంగాణ సమాజం రుణపడి ఉంటుందని, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రెండో రోజు రైతు దినోత్సవం, మూడోరోజు సురక్షాదినోత్సవం,నాలుగో రోజు తెలంగాణ విద్యుత్తు విజయోత్సవం, సింగరేణి సంబురాలు జరుపుకున్నారు. ఐదో రోజు పారిశ్రామిక దినోత్సవం నిర్వహించారు.
ఆరో రోజు నిర్వహించిన సాగునీటి దినోత్సవం నిర్వహించగా, ఏడోరోజు చెరువుల పండుగ సందర్భంగా చెరవులకు బోనాలు సమర్పించారు.ఎనిమిదో రోజు తెలంగాణ సంక్షేమ సంబురాలు, తొమ్మిదో రోజు సుపరిపాలన దినోత్సవం నిర్వహించారు.
పదోరోజున సాహిత్య దినోత్సవం, పదకొండో రోజు తెలంగాణ రన్ చేపట్టారు. 12వ రోజు తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవం, 13వ రోజున వైద్యారోగ్య దినోత్సవం నిర్వహించారు.
14వ రోజున రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన తెలంగాణ పల్లె ప్రగతి దినోత్సవం, 15వ రోజున ప్రగతి దినోత్సవం జరుపుకున్నారు.
‘మావ నాటే మావ రాజ్’ (మా తండాల్లో మా రాజ్యం) అన్న గిరిజనుల దశాబ్దాల కలను సీఎం కేసీఆర్ సాకారం 16వ రోజున గిరిజన దినోత్సవం, 17వ రోజున గ్రామసభలు నిర్వహించారు. 18వ రోజున తెలంగాణ హరితోత్సవం , 19వ రోజు తెలంగాణ విద్యాదినోత్సవం నిర్వహించారు. 20వ రోజున తెలంగాణ ఆధ్యాత్మిక దివస్‌లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు.
21 రోజుల పాటు ఘనంగా జరిగిన తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల చివరి రోజు కేసీఆర్ చేతుల మీదుగా తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం ‘అమరజ్యోతి’ని ప్రారంభించి దశాబ్ది ఉత్సవాలకు ముగింపు పలికారు.