Tungabhadra Dam | హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ)/కొప్పల్: కర్ణాటకలోని తుంగభద్ర డ్యామ్ 19వ గేటు కొట్టుకుపోయింది. శనివారం రాత్రి చైన్ లింక్ తెగిపోవడమే ఇందుకు కారణమని తెలుస్తున్నది. కొట్టుకుపోయిన గేటుపై ఒత్తిడిని తగ్గించేందుకు అధికారులు మరో ఏడు గేట్లను తెరిచి నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో దాదాపు లక్ష క్యూసెక్కుల నీరు వృథాగా పోతున్నది.
కొట్టుకుపోయిన గేటుకు మరమ్మతు పనులను చేపట్టాలంటే 60-65 టీఎంసీల నీటిని అత్యవసరంగా కిందకు విడుదల చేయాలని కర్ణాటకలోని కొప్పల్ జిల్లా ఇన్చార్జి మంత్రి శివరాజ్ తంగడగి చెప్పారు. 20 అడుగుల మేర నీటిని వదిలిన తర్వాతే సమస్య పరిష్కారం అవుతుందని తెలిపారు. ఈ నేపథ్యంలో కొప్పల్ దిగువ ప్రాంతాల ప్రజలకు కర్ణాటక అధికారులు వరద హెచ్చరికలు జారీచేశారు. ఆంధ్రప్రదేశ్ అధికారులు అప్రమత్తమై ఉమ్మడి కర్నూలు జిల్లాతోపాటు సమీప ప్రాం తాల ప్రజలకు హెచ్చరికలు జారీచేశారు.