Harish Rao | ఘోష్ కమిషన్ అప్పటి ఇంజినీర్ల నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను పట్టించుకోలేదని.. అందుకే దాన్ని తాము పీసీసీ కమిటీగా అంటున్నామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు స్పష్టం చేశారు. తమ సూచనలతోనే ప్రాజెక్టును మేడిగడ్డకు మార్చారని నిపుణుల కమిటీ స్పష్టం చేసిందని గుర్తు చేశారు. సభలో కాళేశ్వరం రిపోర్ట్‌పై చర్చ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. ‘సీఎం రేవంత్‌రెడ్డి నాపై ఆరోపణలు చేశారు. కాళేశ్వరం కమిషన్ హరీశ్‌రావును అడిగింది.. ఆయన కూడా అదే విషయాన్ని కమిషన్‌కు చెప్పారని అన్నారు. కమిషన్‌కు ఇచ్చిన ప్రశ్నలు, జవాబులు ఉన్నాయి. చాలా స్పష్టంగా ఘోష్ కమిషన్‌కు నా సమాధానం స్పష్టంగా చెప్పాను. మేడిగడ్డ సాధ్యమని అని చెప్పారు. మేడిగడ్డ నుంచి నేరుగా మిడ్‌మానేరు సాధ్యం కాదని చెప్పారని.. ఆ రిపోర్ట్ కాపీని కూడా ఇస్తూ.. మీకు కూడా (ఘోష్ కమిషన్)కు వారు ఇచ్చిన అఫిడవిట్ మీరే నాకు ఇచ్చారు.
మా సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం పాటించింది.. నీళ్లు లేకపోవడం వల్లనే తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చారని నిపుణుల కమిటీ స్పష్టంగా ఘోష్ కమిషన్‌కు చెప్పింది. దురదృష్టం ఏంటంటే.. ఘోష్ కమిషన్ దాన్ని పట్టించుకోలేదు. అందుకే దాన్ని పీసీసీ కమిటీ అంటున్నం. మీరు చేస్తున్న వాదన మాత్రమే వినిపించింది. ఆ తర్వాత మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డగోలు ఆరోపణలు చేశారు. కొన్ని రికార్డులు మాయం చేశారని ఆరోపించారు. ఈఎన్సీ ఘోష్ కమిషన్‌కు లేఖ ఇచ్చారని.. ఫైవ్ మ్యాన్ కమిటీ నివేదికను పరిగణలోకి తీసుకోలేదని చెప్పినట్లుగా ఉత్తమ్ విమర్శించారు. దీనికి హరీశ్‌రావు మాట్లాడుతూ.. ‘ఉత్తమ్ అన్న నీకు అనుకూలంగా ఉంటే ఒక తీరు.. బాధ్యతాయుతమైన మంత్రిగా ఉండి నిరాధార ఆరోపణలు చేయవచ్చా? అని ప్రశ్నించారు.
‘నిపుణుల కమిటీ చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం మా సూచనలు పాటించిందని చెప్పింది. మా సూచనలతోనే మార్చిందని చెప్పింది. అయినా కూడా కమిషన్ దాన్ని పట్టించుకోలేదంటే.. ఇది ఎంత ప్రీ కన్సివ్డ్.. ప్రీ డిటైర్మైండ్ రిపోర్ట్ అని ఆలోచించాల్సిన అవసరం ఉంది. స్పష్టంగా అర్థమవుతున్నది. నేను చెప్పింది.. రిటైర్డ్ ఇంజినీర్లు చెప్పింది ఒకటే. ఒక రేవంత్‌రెడ్డి, ఉత్తమ్ కుమార్‌రెడ్డి సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. మరి అప్రూవల్స్ గురించి చెప్పారు. వ్యాప్కోస్ అప్రూవల్ గురించి సీఎం నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజు రిపోర్ట్ విషయంలో చర్చ జరుగలేదని.. సొంతంగా నిర్ణయం తీసుకున్నారు.. సమష్టి నిర్ణయం కాదని అన్నారు. ఆనాడు వ్యాప్కోస్‌కు ఇచ్చేటప్పుడు ఆ రోజు కేబినెట్లో చర్చ జరిగింది. తమ్మిడిహట్టి దగ్గర ఇప్పుడు సమస్య ఏందీ? 152 మీటర్ల దగ్గర వాళ్లు (మహారాష్ట్ర) ససేమిరా అన్నరు. మహారాష్ట్రలో కాంగ్రెస్.. ఏపీలో కాంగ్రెస్.. ఢిల్లీలో కాంగ్రెస్ మూడుచోట్ల కాంగ్రెస్ ఉన్నా 2007-2008లో టెండర్లు పిలిచారు.
ఉత్తమ్ కుమార్‌రెడ్డి చాలా గొప్పగా చెప్పారు. డీపీఆర్ లేకుండా టెండర్లు పిలుస్తరా? పనులు చేస్తరా? అని అన్నడు. అసలు ఆ రోజు మీరు (ఉత్తమ్) మంత్రి. 2007-08లో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా మంత్రిగా ఉండొచ్చు. 2007-08లో ప్రాణహిత-చేవెళ్లకు 28 ప్యాకేజీలుగా టెండర్లు పిలిచింది కాంగ్రెస్ ప్రభుత్వమే కదా? అసలు ప్రాణహితకు డీపీఆర్ ఎప్పుడు వచ్చింది? 2010లో వచ్చింది. 2007-08 టెండర్లు పిలిస్తే.. డీపీఆర్ 2010లో వచ్చింది. డీపీఆర్ లేకుండా.. మహారాష్ట్ర అనుమతి లేకుండా 28 ప్యాకేజీలకు టెండర్లు పిలిచి.. మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చి.. సమయాన్ని వృథా చేసింది మీరు. నిన్నాగక మొన్న నారాయణపేట, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఏ డీపీఆర్ లేకుండా, సీడబ్ల్యూసీ అనుమతి లేకుండా టెండర్లు పిలిచింది మీరే కదా? అట్ల చెప్పుకుంటే.. జలయజ్ఞంలో మీరు పిలిచిన టెండర్లకు.. ఏ ఒక్కదానికి సీడబ్ల్యూసీ అనుమతి, డీపీఆర్ లేకుండానే ఆ రోజు టెండర్లు పిలిచారు. ఆ రోజు కాగ్ కూడా తప్పుపట్టింది’ అని హరీశ్ గుర్తు చేశారు.