Jeevan Reddy | హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ)/గజ్వేల్/మర్కూక్: తెలంగాణలో పార్టీపై ఏఐసీసీ పట్టు కోల్పోయిందని సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం ఆలోచనలను అమలు చేయాల్సిన టీపీసీసీ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పినట్టు పనిచేస్తున్నదని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి తీరు వల్ల అధిష్ఠానం కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయిందని చెప్పారు.
రేవంత్‌రెడ్డి చెప్పినట్టుగా పీసీసీ పనిచేస్తుంటే, ఇక కాంగ్రెస్ కార్యకర్తలకు గుర్తింపు ఎక్కడ దొరుకుతుందని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోవడానికి కారకులెవరని నిలదీశారు. కాంగ్రెస్ అధిష్ఠానం నిస్సహాయత వల్ల రాష్ట్ర ప్రభుత్వాన్ని, సీఎం రేవంత్‌రెడ్డిని అదుపు చేయలేకపోతున్నారని పేర్కొన్నారు. అందుకే ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుచేయలేని పరిస్థితి ఉన్నదని విమర్శించారు. హామీలను అమలుచేయాలని రేవంత్‌రెడ్డిపై కాంగ్రెస్ అధిష్ఠానం ఒత్తిడి తీసుకొనిరావడం లేదని మండిపడ్డారు.
శుక్రవారం ఎర్రవెల్లిలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైందని, ‘రేవంత్‌రెడ్డి పోవాలి.. కేసీఆర్ రావాలి’ అనే నినాదం పల్లెపల్లెనా మార్మోగుతున్నదని చెప్పారు. ప్రజలు నాడు మార్పు కోరడానికి పదేండ్లు పట్టిందని, ఇప్పుడు రేవంత్‌రెడ్డి చర్యల వల్ల రెండేండ్లకే మార్పు కోరుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర పురోభివృద్ధిలో బీఆర్ఎస్ పోషించబోయే పాత్ర అత్యంత కీలకమని, ఆ ప్రయాణంలో తాను భాగస్వామి కావడం సంతోషంగా ఉన్నదని తెలిపారు. ‘నేను అధికారం కోసం ఆశపడితే 2019లోనే బీఆర్ఎస్లోకి వెళ్లేవాడిని. అప్పుడు ఫిరాయింపు చట్టం భయం కూడా లేదు. కానీ, నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తుంగలో తొకింది. మూడు లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది? కేవలం 17 వేల ఉద్యోగాలు ఇచ్చి 60 వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు అబద్ధాలు చెప్తున్నారు. నిరుద్యోగులు, కాంట్రాక్టు కార్మికులు రోడ్డున పడ్డారు. అందుకే ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసేందుకే కేసీఆర్ అడుగుజాడల్లో నడువాలని నిర్ణయించుకున్నాను’ అని జీవన్‌రెడ్డి స్పష్టం చేశారు.
‘రేవంత్‌రెడ్డి పోవాలి.. కేసీఆర్ రావాలి’ అనే నినాదం ప్రజల్లో మొదలైందని జీవన్‌రెడ్డి చెప్పారు. ‘నిరుద్యోగుల భవిష్యత్ ఏమవుతున్నది? మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. రెండో ఏడాది లక్ష ఉద్యోగాలన్నారు. మూడు లక్షల ఉద్యోగాలు పోయినయ్. 60 వేల ఉద్యోగాలు ఇచ్చినమని చెప్తున్నరు. కానీ, అసలు ఇచ్చింది 17 వేలు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నం. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల ఉద్యోగం ఉంటుందో, ఊడుతుందో తెలియని పరిస్థితి. ప్రజలు నాడు మార్పు కోరడానికి పదేండ్లు పట్టింది. ఇప్పుడు రెండేండ్లకే మార్పు కోరుతున్నరు. ‘రేవంత్‌రెడ్డి పోవాలి.. కేసీఆర్ రావాలి, కాంగ్రెస్ పాలన పోవాలె.. కేసీఆర్ పాలన రావాలె’ అనే నినాదం ప్రజల్లో వస్తున్నది. కాంగ్రెస్ పార్టీకి ఇంకా రెండున్నరేండ్లు సమయం ఉన్నది. ఈ ఉన్న కాలమైనా ప్రజలకు మెరుగైన పాలన అందించాలి. ప్రజాహితం కోసం పనిచేయాలి. అది చేయకుండా జీవన్‌రెడ్డి ఎందుకు పోతున్నడంటే.. నేనేమైనా అధికార పార్టీలోకి పోవడం లేదుకదా? కేసీఆర్ కలిసి పనిచేద్దామన్నారు. రాష్ర్టాభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు. 2019లో ఎమ్మెల్సీగా నేనొక్కడినే అధికార బీఆర్ఎస్పై పోరాడాను. అధికారం కాంక్షించే వాడిని అయితే ఆనాడే బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లేవాడిని. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోతున్నది. అందుకే ప్రజల పక్షాన ప్రజాక్షేతంలో పోరాడటానికి ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తున్న’ అని జీవన్‌రెడ్డి ఈ సందర్భంగా స్పష్టంచేశారు.
ఈ నెల 20వ తేదీలోపే జగిత్యాలలో భారీ బహిరంగ సభ ఏర్పాటుచేసి, ఆ వేదికపైనే మాజీ మంత్రి జీవన్‌రెడ్డి పార్టీ అధినేత కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరుతారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. శుక్రవారం ఎర్రవల్లిలో కేసీఆర్‌తో సమావేశమైన అనంతరం హైదరాబాద్ తిరుగు ప్రయాణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రైతులు, ప్రజా సమస్యలపై దృష్టి సారిస్తూ ఈ సభను నిర్వహిస్తామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఫ్లీనరీకి ముందే మరిన్ని చేరికలు ఉంటాయని వెల్లడించారు. కేసీఆర్‌తో కలిసి పనిచేయడానికి జీవన్‌రెడ్డి ముందుకు వచ్చారని చెప్పారు. జీవన్‌రెడ్డికి పార్టీలో తగిన ప్రాధాన్యం కల్పిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారని తెలిపారు.
ప్రజాక్షేత్రంలోకి బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రాబోతున్నారని, త్వరలోనే జగిత్యాల పట్టణంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని ఎమ్మెల్సీ ఎల్ రమణ వెల్లడించారు. ఎర్రవల్లిలో కేసీఆర్‌తో సమావేశమైన అనంతరం హైదరాబాద్ తిరుగు ప్రయాణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘కొత్తగా వచ్చిన ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని అనుకున్నాం. ప్రభుత్వ పాలనా తీరును ఈ రెండున్నరేండ్ల కాలంలో చూశాం. కోర్టులు చీవాట్లు పెట్టినా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు తీర్చలేకపోయింది’ అని ఆయన విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ర్టాన్ని పట్టించుకొనే పరిస్థితిలో లేదని, ఉత్తర తెలంగాణ నుంచి ఎన్నికైన ఎంపీ కేంద్ర మంత్రిగా ఉన్నా పైసా నిధులు రావడం లేదని ఆయన దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ను తిరుగులేని పార్టీగా బలోపేతం చేస్తామని రమణ ఈ సందర్భంగా చెప్పారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తామని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను అడుగడుగునా ఎండగడుతామని ఆయన స్పష్టం చేశారు.
ఉత్తర తెలంగాణకు రాజకీయ కూడలిగా ఉన్న జగిత్యాలలో త్వరలోనే భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని జీవన్‌రెడ్డి చెప్పారు. ఈ సభకు ముఖ్య అతిథిగా రావాలని కేసీఆర్‌ను కోరగా, ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. సభ నిర్వహణ తేదీని త్వరలోనే ప్రకటిస్తామని, ఈ సభ ద్వారా తెలంగాణ రాజకీయ భవిష్యత్‌కు ఒక దిశానిర్దేశం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. అయితే, సభా స్థలిని పరిశీలించేందుకు బీఆర్ఎస్ నేతలు గ్యాదరి బాలమల్లు, మల్రెడ్డి రంగారెడ్డి, ఎల్ రమణ శనివారం జగిత్యాలకు వెళ్లనున్నారు. జీవన్‌రెడ్డితో సమావేశమై సభాస్థలిని నిర్ణయిస్తారు. 20వ తేదీన లేదా 22వ తేదీన సభ నిర్వహించే అవకాశం ఉన్నది. అయితే, సభ ఏ తేదీన నిర్వహిస్తారనే అంశంపై శనివారం నాడు స్పష్టత వస్తుందని భావిస్తున్నారు.

ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసానికి వచ్చిన మాజీ మంత్రి జీవన్‌రెడ్డిని సాదరంగా ఆహ్వానిస్తున్న కేటీఆర్. చిత్రంలో గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్‌రెడ్డి, విద్యాసాగర్‌రావు, డాక్టర్ సంజయ్ తదితరులు

ఎర్రవల్లిలోని తన నివాసంలో జీవన్‌రెడ్డితో ముచ్చటిస్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. చిత్రంలో కేటీఆర్, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, వేముల ప్రశాంత్‌రెడ్డి, కే విద్యాసాగర్‌రావు, ఎల్ రమణ, డాక్టర్ కే సంజయ్, గ్యాదరి బాలమల్లు, రాగిడి లక్ష్మారెడ్డి, దావ వసంత తదితరులు