హనుమకొండ: వరంగల్‌లో బీఆర్ఎస్ నేతలపై అక్రమ నిర్బంధాలు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్యను (Thatikonda Rajaiah) పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. రఘునాథపల్లి మండలంలో పర్యటన దృష్ట్యా ఆయనను నిర్బంధించారు. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే, పార్టీ ఫిరాయింపుదారు అయిన కడియం శ్రీహరిపై (Kadiyam Srihari) వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, ఆయన క్షమాపణ చెప్పాలని లేనట్లయితే పర్యటనను అడ్డుకుంటామని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. దీంతో రాజయ్యను పోలీసులు ఇంట్లో నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన నివాసానికి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకుంటున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొన్నది.
కాగా, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో ఉపఎన్నిక వస్తే ఎమ్మెల్యే కడియం శ్రీహరికి డిపాజిట్ కూడా రాదని తాటికొండ రాజయ్య అన్నారు. ‘ఊరూరా బీఆర్ఎస్ సంక్షేమాలు-ఇంటింటికీ కేసీఆర్ పథకాలు’ కార్యక్రమంలో భాగంగా హనుమకొండ జిల్లా వేలేరు మండలంలోని బండతండా, చింతలతండా, కమ్మరిపేట, లోక్యతండా, సోడాషపల్లి, మల్లికుదుర్ల గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అవకాశవాదులంతా కడియం శ్రీహరి వెంట ఉన్నారని, ఇందిరతో ఉన్నోళ్లే అసలైన కాంగ్రెస్ కార్యకర్తలని అన్నారు. రానున్న రోజుల్లో కడియం శ్రీహరి కచ్చితంగా రాజీనామా చేస్తాడని, లేదంటే సుప్రీం కోర్టు తీర్పుతో ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీచేయకుండా నిషేధం విధించే అవకాశముందన్నారు. ఏడాది క్రితం తాను కాంగ్రెస్‌లో చేరానని పబ్లిక్ మీటింగ్‌లో శ్రీహరే స్వయంగా చెప్పారని, దానినే స్పీకర్‌కు లిఖిత పూర్వకంగా అందజేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌తో బేరం కుదిరే వరకు ఆరు నెలల్లో ప్రభుత్వం కూలిపోతుందని చెప్పిన కడియం అనుకున్న మేరకు గిట్టుబాటు కాగానే ఆ పార్టీ కండువా కప్పుకున్నాడని ఎద్దేవా చేశారు. దేవాదుల ప్రాజెక్ట్ పనులు పూర్తి చేసి రెండు పంటలకు నీళ్లిచ్చే వరకు పోరాటం చేస్తానని రాజయ్య పేర్కొన్నారు