హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): కేసీఆర్, కేటీఆర్‌పై అడ్డగోలుగా మాట్లాడితే కడియం శ్రీహరి నాలుకను చీరేస్తామని మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య హెచ్చరించారు. ‘నక్కజిత్తులమారివి, వెన్నుపోటుదారుడివి, అవకాశవాదివి, అభివృద్ధి నిరోధకుడివి, అవినీతిపరుడివి, తిన్నింటివాసాలు లెక్కబెట్టే నువ్వా.. కేసీఆర్, కేటీఆర్ గురించి మాట్లాడేది?’ అని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ టికెట్‌తో గెలిచిన కడియంకు దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ గెలవాలని సవాల్ విసిరారు. తెలంగాణభవన్‌లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శ్రీహరికి కేసీఆర్ ఏం తకువ చేశారని నిలదీశారు.
కడియంను కేటీఆర్ ముందు బెంచిలో కూర్చోబెడితే, కాంగ్రెస్‌లో చేరి వెనుక బెంచిలో కూర్చునే స్థాయికి వచ్చారని విమర్శించారు. ఫిరాయింపు చట్టాలపై గౌరవం ఉన్నదని కడియం మాట్లాడటం సిగ్గుచేటని మండిపడ్డారు. 1994లో రాజకీయాల్లో రాకముందు డొకు సూటర్, తెగిపోయే రబ్బరు చెప్పులు, కిటికీలకు గోనె సంచులు, గచ్చు ఇల్లు ఉన్న కడియం శ్రీహరి.. నేడు అద్దాల భవంతులు, విదేశాల్లో ఆస్తులు ఎలా సంపాదించారో చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రిగా శ్రీహరి 8% కమీషన్ తీసుకున్నారని, ఆయన బిడ్డ, ఎంపీ కావ్య, అల్లుడు నజీర్ హాంకాంగ్, సింగపూర్‌లో ఆస్తులు పొగేశారని విమర్శించారు. కడియం శ్రీహరి స్టేషన్‌ఘన్‌పూర్‌కు టెక్స్టైల్స్ పార్, డిగ్రీ కళాశాల రాకుండా చేశారని, మున్సిపాలిటీ కాకుండా అడ్డుకున్నారని, దేవాదుల ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పనిచేశారని దుయ్యబట్టారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు బొమ్మెర రామూర్తి, కాంబోజు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.