హైదరాబాద్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ): ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంలో స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్యానికి తీవ్ర విఘాతమని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ అనర్హత పిటిషన్‌పై స్పీకర్ ఆయనకు క్లీన్చిట్ ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
సంజయ్ పార్టీ మారినట్టు అన్నీ ఆధారాలున్నా స్పీకర్ మాత్రం తిరస్కరించడం విడ్డూరంగా ఉన్నదని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ సీఎం రేవంత్ డైరెక్షన్లో నిర్ణయాలు తీసుకుంటున్న ఆయనను తెలంగాణ సమాజం క్షమించబోదని హెచ్చరించారు. శాసనసభాపతి వ్యవహారశైలిని ప్రజాస్వామికవాదులు సైతం తప్పుబడుతున్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవుపలికారు.