స్టేషన్ ఘన్పూర్, సెప్టెంబర్ 16 : యూరియా కోసం మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య-ఫాతిమామేరి దంపతులు మంగళవారం రైతులతో కలిసి జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లోని సొసైటీ వద్ద క్యూలో నిల్చున్నారు. 800 మంది రైతులు రాగా, 400 బస్తాల యూరియా మాత్రమే రాగా ఒక్కరికి ఒకటి చొప్పున పంపిణీచేశారు. గంటకుపైగా నిరీక్షించిన రాజయ్య దంపతులకు యూరియా లభించకపోవడంతో ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. రాష్ట్రానికి 9 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా, ఇప్పటివరకు 5 లక్షల మెట్రిక్ టన్నులు కూడా అందలేదని రాజయ్య ధ్వజమెత్తారు.
నెల రోజులుగా రైతులు యూరియా కోసం చంటి పిల్లలను ఎత్తుకుని, సద్దులు తెచ్చుకుని సొసైటీల వద్ద క్యూలో నిల్చుంటున్నా స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. యూరియా సమస్యను పరిష్కరించలేని కడియం ఉప ఎన్నికల జ్వరం వచ్చి ఇంట్లో ఉన్నారని ఎద్దేవా చేశారు. వరంగల్ ఎంపీ కావ్య ఢిల్లీలో చకర్లు కొడుతున్నదని విమర్శించారు. భార్యాభర్తలం యూరియా కోసం లైన్లో నిలబడి టోకెన్ తీసుకున్నా బస్తా అయినా దొరకలేదని ఆవేదన వ్యక్తంచేశారు. మాజీ ఎమ్మెల్యే పరిస్థితే ఇలా ఉంటే, సాధారణ రైతుల స్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవువుతున్నదని తెలిపారు. ఒక వైపు సాగునీరు, మరోవైపు పంట చేన్లకు యూరియా అందక వ్యవసాయం, కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతులకు విరక్తి పుడుతున్నదని చెప్పారు.