Telangana | హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): గత కొన్ని రోజులుగా చల్లటి వాతావరణంతో ఉపశమనం పొందిన రాష్ట్ర ప్రజలను పెరిగిన ఉష్ణోగ్రతలు ఇబ్బంది పెడుతున్నాయి. అధిక ఉష్ణోగ్రత, ఉక్కపోతతో మంగళవారం జనం ఇక్కట్లకు గురయ్యారు. బుధవారం నుంచి ఎండల తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు. బంగాళాఖాతంలో తుఫాను ప్రభావం ఉన్నప్పటికీ.. ఆదిలాబాద్, నల్లగొండ జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా మిగతా జిల్లాల్లో 40 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
రాబోయే వారాల్లో సుమారు 2 డిగ్రీల నుంచి 4 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. వడగాలుల ప్రభావం ఉంటుందని, వృద్ధులు, పిల్లలు అత్యవసరమైతే తప్పితే బయటకు వెళ్లొద్దని నిపుణులు సూచిస్తున్నారు. మంగళవారం ఉదయం నుంచి ఎండల తీవ్రత ఉండగా మధ్యాహ్నం ఒక్కసారిగా చల్లబడింది. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షం కురిసింది. సాయంత్రం హైదరాబాద్ జంట నగరాల్లో వర్షం కురిసింది.
ఆగ్నేయ బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతున్నది. ఇది క్రమంగా వాయుగుండంగా, అనంతరం క్రమంగా బలపడి తుఫానుగా మారనున్నట్టు ఐఎండీ వెల్లడించింది. ఈ నెల 12 ఉదయం వరకు ఇది క్రమంగా బంగ్లా-మయన్మార్ వైపు కదులుతుందని చెప్పింది. దీని ప్రభావంతో అండమాన్ నికోబార్ దీవుల్లో ఓ మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్టు తెలిపింది. అండమాన్ సహా ఏపీ, తమిళనాడు, ఒడిశా తదితర తీరప్రాంతాలకు చెందిన మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.