హైదరాబాద్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు, సిబ్బంది వేతనాలు పక్కదారి పడుతున్నట్టు తెలుస్తున్నది. మంత్రుల సహకారం, ఎమ్మెల్యేల అండదండలు, బడాబాబుల అజమాయిషీలో, ఐఏఎస్ అధికారుల బినామీల చేతుల్లో నడుస్తున్న ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలు (Outsourcing) ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నట్టు పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. తమ ఏజెన్సీల్లోని ఉద్యోగుల వివరాలను ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్‌లో నమోదు చేయకుండా, పనిచేయనివారి పేర్లతో నకిలీ జాబితాలు సృష్టించి ఏటా రూ.160 కోట్ల దాకా కొల్లగొడుతున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
రాష్ట్రంలో ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్ అస్తవ్యస్త నిర్వహణే ఇందుకు సాక్ష్యంగా నిలిచింది. ప్రభుత్వంలో పనిచేసే అన్ని రకాల ఉద్యోగుల ఆధార్, సెల్‌ఫోన్ నంబర్ సహా పూర్తి వివరాలను ఈ పోర్టల్‌లో నమోదు చేయాలి. కానీ, ఆ ప్రక్రియ నేటికీ పూర్తికాలేదు. ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్‌ను నిర్వహిస్తున్న రాష్ట్ర ఆర్థికశాఖ ఎన్నిసార్లు ఆదేశాలిచ్చినా ఆయా శాఖల హెచ్వోడీలు పట్టించుకోవడం లేదు. అక్టోబర్ 1 లోగా వివరాలు నమోదు చేయకపోతే ఉద్యోగుల వేతనాలు నిలిపివేస్తామని హెచ్చరించినా ఏమాత్రం బెదరడం లేదు.
ఉద్యోగుల వివరాల నమోదులో జాప్యంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, బడాబాబుల అండదండలు, ఐఏఎస్ అధికారుల బినామీల చేతుల్లో ఏజెన్సీలు నడుస్తుండటం వల్లే ఉద్యోగుల వివరాలను ఇవ్వడం లేదనే ఆరోపణలున్నాయి. అధికార పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్సీతోపాటు ఖమ్మం జిల్లా మంత్రుల సానుభూతిపరులు, మాజీ ఐఏఎస్‌ల అనుచరులు ఔట్సోర్సింగ్ మ్యాన్‌పవర్ ఏజెన్సీలను నిర్వహిస్తున్నట్టు సమాచారం. వారికి ప్రభుత్వ పెద్దలతో ఉన్న సాన్నిహిత్యాన్ని అండగా చూసుకుని తమ ఏజెన్సీల్లోని ఉద్యోగుల వివరాలను ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్‌లో నమోదు చేయడం లేదని, పనిచేయనివారి పేర్లతో నకిలీ జాబితాలు సృష్టించి ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని తెలుస్తున్నది.
అన్ని ప్రభుత్వ శాఖల్లో కలిపి 5.21 లక్షల మంది శాశ్వత ఉద్యోగులు, 4.93 లక్షల తా తాలిక (ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు పద్ధతిలో పనిచేసే) ఉద్యోగులు ఉన్నారు. వారిలో ఇప్పటివరకు 2.22 లక్షల మంది శాశ్వత ఉద్యోగు లు, 2.74 లక్షల మంది తాత్కాలిక ఉద్యోగుల వివరాలు మాత్రమే ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్‌లో నమోదైనట్టు తెలిసింది. కొన్ని కార్యాలయాల్లో తాతాలిక ఉద్యోగులు మానేసినా, అనధికారికంగా దీర్ఘకాలిక సెలవులో వెళ్లినా వారి పేర్లతో వేతనాలు డ్రా చేస్తున్నట్టు సమాచారం. ఒకే ఉద్యోగి 4 ఉద్యోగాలు చేసినట్టు రికార్డులు సృష్టించి 4 జీతాలు తీసుకుంటున్న ఘటనలు బయటపడ్డాయి. 18,000 మంది బోగస్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఏటా అక్రమంగా వేతనాలు పొందుతున్నారని, వారిలో రాజకీయ నాయకులు, ప్రైవేటు ఉద్యోగులు, గృహిణులు సైతం ఉన్నట్టు వినికిడి. ఏటా రూ.160 కోట్ల వరకు స్వాహా చేస్తున్నట్టు స మాచారం. ఆర్థిక, హోం శాఖలతోపాటు సెక్రటేరియట్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగుల్లో 100 మంది వివరాలను ఇప్పటికీ ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్‌లో పొందుపర్చలేదు. వారి తో కొందరు ఉన్నతాధికారులు తమ ఇండ్లలో సేవ చేయించుకోవడమే ఇందుకు కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
బినామీ ఉద్యోగుల పేరిట కోట్ల రూపాయల ప్రజాధనం పక్కదారి పడుతున్నట్టు తెలియడంతో కాంగ్రెస్ సర్కారు దిద్దుబాటు చర్యలకు దిగింది. సీనియర్ ఐఏఎస్ అధికారులు నవీన్ మిట్టల్, లోకేశ్ కుమార్, కృష్ణభాస్కర్‌తో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి 60 రోజుల్లోగా ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కరించాలని ఆ కమిటీకి స్పష్టంచేసింది. దీంతో ఉద్యోగుల పేరు, ఆధార్, సెల్ నంబర్లను పోల్చిచూడటం ద్వారా నిజంగా ఎంత మంది ఉద్యోగులు పనిచేస్తున్నారో తెలుస్తుందని, ఉద్యోగుల వివరాలను ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్‌లో నమోదు చేయడం ద్వారా వేతనాల చెల్లింపులో పారదర్శకత వస్తుందని ఈ కమిటీ భావించింది. అందుకే ప్రభుత్వ శాఖలు, సంస్థలు, పీఎస్‌యూలు, యూనివర్సిటీలు, కార్పొరేషన్లు, సొసైటీలు, ఇతర సంస్థల్లో పనిచేసే ఫుల్‌టైమ్, పార్ట్‌టైమ్, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్, డెయిలీ వేజ్ ఉద్యోగుల పూర్తి వివరాలను ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్‌లో నమోదుచేయాలని ఆదేశించారు. అయినప్పటికీ ఉద్యోగుల వివరాలను ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్‌లో చేర్చే ప్రక్రియ నేటికీ ‘నత్తనడక’లా కొనసాగుతున్నది.
రాష్ట్రంలో పనిచేస్తున్న అన్నిరకాల ఉద్యోగుల వివరాలతో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి. కొన్ని శాఖల అధికారులకు ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్‌లో ఉద్యోగుల వివరాలు నమోదు చేయడం రావడం లేదు. జలమండలిలో యూనిక్ ఐడీలే రాలేదు. తాజాగా రెవెన్యూ శాఖ ఉద్యోగులవి అయ్యాయి. అధికారుల నిర్లక్ష్యం వల్ల చిరుద్యోగులకు సకాలంలో వేతనాలు అందడం లేదు. మిషన్ భగీరథ ఉద్యోగులతోపాటు పశువైద్య శాఖలోని గోపాలమిత్రలకు 8 నెలల నుంచి వేతనాలు రావడం లేదు. కొన్ని శాఖల్లో ఉద్యోగుల రెన్యూవల్ జరుగక వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ సమస్యల పరిష్కారానికి త్రిసభ్య కమిటీ చేపట్టిన చర్యలేమిటో ప్రభుత్వం వెల్లడించాలి.
– పుల్లగుర్ల రాజిరెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్