వేమనపల్లి, అక్టోబర్ 24 : ఇకపై మద్యం, గుడుంబా తాగేది లేదంటూ మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం సుంపుటం గ్రామస్థులు తేల్చిచెప్పారు. గ్రామంలో మద్యపానాన్ని నిషేధిస్తున్నామని, గుడుంబా, నాటుసారా, మద్యం ఎవరైనా అమ్మినా, కొనుగోలు చేసినా, తయారు చేసినా, తాగినా రూ.50 వేల జరిమానా విధించనున్నట్టు స్థానికులు శుక్రవారం ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.
గుడుంబా, మద్యం తాగడం వల్ల అనారోగ్యానికి గురై కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని తెలిపారు. గుడుంబారహిత గ్రామంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నట్టు చెప్పారు. మద్యపాన నిషేధం తక్షణమే అమలులోకి వస్తుందని, ఎవరైనా గ్రామంలో మద్యం, గుడుంబా అమ్మడానికి వస్తే వారిని పోలీసులకు అప్పగిస్తామని హెచ్చరించారు. అనంతరం మద్యపాన నిషేధంపై ప్రతిజ్ఞ చేశారు.