హైదరాబాద్, జనవరి 28 (నమస్తేతెలంగాణ): ‘దావోస్‌కు వెళ్లి రూ.1.78 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించామంటూ రేవంత్ గొప్ప లు చెప్పుకోవడం విడ్డూరం. ఆ పెట్టుబడులపై చర్చించేందుకు బీఆర్ఎస్ సిద్ధంగా ఉన్నది. దమ్ముంటే ప్రభుత్వ పెద్దలు ఇందుకు సిద్ధ మా?’ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత పొన్నాల లక్ష్మయ్య సవాల్ విసిరారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో మంగళవారం బీఆర్ఎస్ నేత ఫయాజ్‌తో కలిసి మీడియాతో మా ట్లాడారు. దావోస్ పెట్టుబడులపై సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్‌బాబు పరస్పర విరుద్ధంగా మాట్లాడుతూ ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని చెప్పారు. బీఆర్ఎస్ సర్కారు పదేండ్లలో అనుసరించిన పారిశ్రామిక అనుకూల విధానాలతో రాష్ర్టానికి 2,000 స్టార్టప్ కంపెనీలు వచ్చాయని తెలిపారు.
7 లక్షల స్క్వేర్ ఫీట్లకు ఆఫీస్ స్పేస్ పెరిగిందని, ఐటీ ఇన్నోవేషన్‌లో 4 శాతానికి చేరిందని గుర్తుచేశారు. 2014లో మూడు లక్షలున్న ఐటీ ఉద్యోగాలను 2024 నాటికి 9 లక్షలకు పెంచిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని చెప్పారు. ఈ వాస్తవాలను సీఎం రేవంత్ వక్రీకరిస్తున్నారని ఆరోపించారు. కేవలం తన ఏడాది పాలనను చూసి పరిశ్రమలు తరలివస్తున్నాయని చెప్పుకోవడం సిగ్గుచేటని పేర్కొన్నారు.
నాడు విత్తనాలు వేస్తే పెరిగిన చెట్లకు కాసిన కాయలను చూపిస్తూ ఆయన తన గొప్పగా పేర్కొనడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. కేసీఆర్ గురుకులాలను స్థాపించి పేదలకు విద్యావకాశాలు కల్పిస్తే రేవంత్ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ పేరిట గప్పాలు కొడుతున్నారని మండిపడ్డారు.