e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, January 26, 2022
Home News హైదరాబాదే బెస్ట్‌

హైదరాబాదే బెస్ట్‌

  • సకల సౌకర్యాలతో విశ్వనగరంగా పరిణామం
  • తాత్కాలిక కార్యకలాపాలకు 25 వేల అడుగుల స్థలం
  • మధ్యవర్తిత్వ కేంద్రం సన్నాహక భేటీలో ముఖ్యమంత్రి కేసీఆర్‌
  • తెలంగాణ తరఫున సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణకు ధన్యవాదాలు

హైదరాబాద్‌, డిసెంబర్‌ 4 (నమస్తే తెలంగాణ): అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రాన్ని (ఇంటర్నేషనల్‌ ఆర్బిట్రేషన్‌ అండ్‌ మీడియేషన్‌ సెంటర్‌) హైదరాబాద్‌లో ఏర్పాటుచేయాలని నిర్ణయించటం అత్యుత్తమ ఎంపిక అని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఐఏఎంసీ వల్ల దేశంలోని పారిశ్రామిక రంగానికి, తద్వారా దేశానికి గొప్ప ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ నోవాటెల్‌ హోటల్‌లో శనివారం జరిగిన ఐఏఎంసీ సన్నాహక సదస్సులో సీఎం కేసీఆర్‌ పాల్గొని మాట్లాడారు. మధ్యవర్తిత్వ కేంద్రాన్ని వెంటనే ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున 25 వేల చదరపు అడుగుల స్థలాన్ని సమకూర్చామని చెప్పారు. శాశ్వత భవనాల నిర్మాణం కోసం పుప్పాలగూడలో స్థలాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ ఎంపికచేశారని ప్రకటించారు. జస్టిస్‌ రమణ స్వీయ పర్యవేక్షణలో న్యాయమూర్తులు జస్టిస్‌ నాగేశ్వర్‌రావు, జస్టిస్‌ ఆర్పీ రవీంద్రన్‌ తదితర ట్రస్టీల నేతృత్వంలో ఈ కేంద్రానికి అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు లభిస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు.

ఐఏఎంసీని హైదరాబాద్‌లో ఏర్పాటుచేసేందుకు చొరవచూపిన జస్టిస్‌ ఎన్వీ రమణకు తెలంగాణ ప్రభుత్వం, ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు. ఐటీ, పారిశ్రామికరంగంలో దూసుకుపోతుండటం, అంతర్జాతీయ స్థాయి వసతులతో విమానాశ్రయాలు, హోటళ్లు ఉండటం, ప్రపంచంలోని అన్ని ప్రాంతాలతో కనెక్టివిటీ ఉండటం హైదరాబాద్‌ను విశ్వనగరంగా నిలిపాయని సీఎం అన్నారు. ఫార్చ్యూన్‌-500 జాబితాలోని అనేక కంపెనీలు హైదరాబాద్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని గుర్తుచేశారు. నగరం కొన్ని శతాబ్దాలుగా భిన్న సంస్కృతులు, భాషలకు కేంద్రంగా ఉన్నదని, అత్యంత అనుకూల వాతావరణం హైదరాబాద్‌ సొంతమని వివరించారు. ఇలా అన్నిరకాల సౌకర్యాలు ఉన్నందున ఐఏఎంసీని హైదరాబాద్‌లో ఏర్పాటుచేయటం అత్యుత్తమ ఎంపిక అవుతుందని వెల్లడించారు.

- Advertisement -

మన సంస్కృతిలోనే మధ్యవర్తిత్వం ఉన్నది

మధ్యవర్తిత్వం అనేది మన సంస్కృతిలో భాగమని సీఎం కేసీఆర్‌ అన్నారు. గ్రామాల్లో ఏవైనా గొడవలు జరిగితే గ్రామ పెద్దల సమక్షంలో అక్కడికక్కడే చర్చించి, వివాదాలను పరిష్కరించుకొనే సంప్రదాయం మనదేశంలో అనాదిగా వస్తున్నదని గుర్తుచేశారు. ‘రచ్చబండ’ రూపంలో కొన్నాళ్ల కిందటివరకు ఈ విధానం కొనసాగిందని చెప్పారు. ఆధునిక కాలంలో ప్రత్యామ్నాయ వివాద పరిష్కార వ్యవస్థలుగా ‘మధ్యవర్తిత్వ కేంద్రాలు’ ఖ్యాతి గాంచాయని తెలిపారు. ఆర్థిక వృద్ధిలో వ్యాపార అనుకూల వాతావరణం (ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌), ఒప్పందాలను అమలుచేయడం ఎంతో కీలకమని, ఈ విషయంలో మనదేశం కాస్త వెనుకబడి ఉన్నదని సీఎం పేర్కొన్నారు. ఇతర దేశాలతో పోల్చితే మధ్యవర్తిత్వ కేంద్రాన్ని ఆలస్యంగా ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. కొన్నిసార్లు సంస్థలు, సరఫరాదారులు, వినియోగదారులు, భాగస్వాముల మధ్య వివాదాలు తలెత్తుతాయని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇలాంటి వివాదాల్లో భాగం అవుతాయని తెలిపారు. దశాబ్దాలుగా మనకు ఎదురైన అనుభవాల ప్రకారం వ్యవస్థాపరమైన కారణాలు లేదా సరిపడా జడ్జీలు, కోర్టులు లేకపోవడం వంటి లోపాల వల్ల కొన్ని వివాదాలు దీర్ఘకాలంపాటు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఈ కారణాలవల్ల ఆయా సంస్థల పనితీరు, వార్షిక ఆదాయంపై తీవ్ర ప్రభావం పడుతున్నదని, దీంతో అనేక కంపెనీలు సింగపూర్‌, పారిస్‌, దుబాయ్‌, లండన్‌ తదితర విదేశాలకు వెళ్లి వివాదాలు పరిష్కరించుకొని వస్తున్నాయని చెప్పారు.

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement