హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం రాష్ట్రవ్యాప్తంగా 7,754 స్పెషల్ బస్సులను నడపడానికి ప్రణాళిక సిద్ధం చేసింది. ఈనెల 20నుంచి అక్టోబర్ 2వరకు ప్రత్యేక బస్సులను నడపనున్నట్టు గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది. సద్దుల బతుకమ్మ 30న, దసరా అక్టోబర్ 2న ఉన్నందున.. 27 నుంచే ప్రజలు సొంతూళ్లకు వెళ్లనుండటంతో బస్సులను నడపనున్నట్టు పేర్కొన్నది. తిరుగు ప్రయాణాలను దృష్టిలో పెట్టుకుని అక్టోబర్ 5, 6 తేదీల్లోనూ బస్సులను ఏర్పాటు చేసినట్టు తెలిపింది.
ఆర్టీసీ కార్మికులకు దసరా అడ్వాన్స్ కింద రూ.12 వేలు ఇవ్వాలని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ప్రభుత్వానికి, ఆర్టీసీ సంస్థకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బాబు, వెంకన్న గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.