హైదరాబాద్: రాఖీపౌర్ణమికి స్పెషల్ బాదుడుపై టీజీఎస్ ఆర్టీసీ (TGSRTC) వివరణ ఇచ్చింది. నిర్వహణ ఖర్చుల నిమిత్తం స్పెషల్ బస్సుల్లో (Special Bus) మాత్రమే చార్జీలు పెంచినట్లు (Charges Hike) తెలిపింది. ఈ నెల 11 వరకు స్పెషల్ బస్సుల్లో చార్జీలు పెంచినట్లు వెల్లడించింది. ఆ తర్వాత చార్జీలు సాధారణంగానే ఉంటాయని పేర్కొంది. రద్దీకి అనుగుణంగా బస్సులు నడుపుతున్నామని, ప్రయాణికులు లేకున్నా బస్సులను వెంటనే తిరిగి తీసుకురావాల్సి వస్తుందని, ఈ నేపథ్యంలో నిర్వహణ ఖర్చుల నిమిత్తం స్పెషల్ బస్సుల్లో మాత్రమే చార్జీలు పెంచామని ఓ ప్రకటనలో వెల్లడించింది.
‘సోదర, సోదరీమణుల మధ్య ప్రేమ, అనుబంధాలకు ప్రతికైనా రాఖీ పౌర్ణమి పర్వదిన సందర్భంగా ప్రయాణికులకు రవాణాపరమైన అసౌకర్యం కలుగకుండా టీజీఎస్ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది. ప్రతి ఏడాది మాదిరిగానే ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచింది. రాష్ట్ర ప్రభుత్వ జీవో ప్రకారం రాఖీ పండుగకు నడిచే స్పెషల్ బస్సుల్లో టికెట్ ధరలను సంస్థ సవరించింది. ప్రత్యేక బస్సుల్లో మాత్రమే రూ.1.50 వరకు టికెట్ ధరలను సవరించింది. స్పెషల్ బస్సులు మినహా రెగ్యూలర్ బస్సుల్లో సాధారణ చార్జీలే అమల్లో ఉంటాయి. ఈ నెల 11వ తేదీ వరకు నడిచే స్పెషల్ బస్సుల్లో మాత్రమే ఈ సవరణ చార్జీలు వర్తిస్తాయి. ప్రయాణికులకు సమాచార నిమిత్తం స్పెషల్ సర్వీసులకు బస్సు ముందు భాగంలో డిస్ ప్లే బోర్డులను సంస్థ ఏర్పాటు చేసింది.
ప్రధాన పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో ప్రజలకు రవాణా పరంగా ఇబ్బందులు తలెత్తకుండా వారిని క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేసేందుకు స్పెషల్ సర్వీసులను ఆర్టీసీ యాజమాన్యం నడుపుతోంది. తిరుగు ప్రయాణంలో స్పెషల్ బస్సుల్లో ప్రయాణికుల రద్దీ ఏమాత్రం లేనప్పటికీ.. రద్దీ ఉన్న రూట్లలో ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఖాళీ బస్సులను త్వరతగతిన సంస్థ వెనక్కి తెప్పిస్తుంది. ఆ స్పెషల్ బస్సులకు అయ్యే కనీస డీజిల్ ఖర్చులు, నిర్వహణ మేరకు టికెట్ ధరను సవరించుకోవాలని 2003లో జీవో నంబర్ 16 ను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. ఈ జీవో ప్రకారం స్పెషల్ బస్సులకు అయ్యే కనీస డీజిల్ ఖర్చులు, నిర్వహణ మేరకు టికెట్ ధరలను రాఖీ పండుగ సందర్బంగా సంస్థ సవరించింది.
రాఖీ పౌర్ణమికి ప్రైవేట్ వాహనాల్లో ప్రమాదకర ప్రయాణం చేయొద్దని ప్రజలకు టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం సూచిస్తోంది. ఆర్టీసీ సిబ్బంది ఎంతో అనుభవజ్ఞులని, సొంతూళ్లకు వెళ్లే వారు తమ బస్సుల్లో సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని కోరుతూ.. అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తోంది.’ అని తెలిపింది.
కాగా, రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్టాండ్లలో రాఖీ పండుగ ప్రయాణికుల రద్దీ నెలకొంది. సికింద్రాబాద్ జేబీఎస్, ఎంజీబీఎస్, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, ఉప్పల్ బస్టాండ్లలో బస్సుల కోసం ప్రయాణికులు ఎదురుచూస్తున్నారు. ఎక్స్‌ప్రెస్, ఆర్డినరీ బస్సులు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో రద్దీకి అనుగుణంగా రాఖీ స్పెషల్ పేరుతో ఆర్టీసీ బస్సు సర్వీసులను అందిస్తున్నది.
అక్కాచెల్లెండ్లపై ఆర్టీసీ ‘స్పెషల్ బాదుడు’.. రాఖీ పండుగకు ప్రత్యేక చార్జీల వడ్డింపు
Kantara | కాంతార టీమ్‌ని వెంటాడుతున్న వరుస విషాదాలు.. తాజాగా మరో వ్యక్తి మృతి