హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): ఆడబిడ్డల పండుగ రాఖీపౌర్ణమికి ఆర్టీసీ స్పెషల్ బాదుడుతో స్వాగతం చెప్పింది. పలు బస్టాండ్లలో తీవ్రంగా ఉండే రద్దీని ఆసరా చేసుకొని.. స్పెషల్ బస్సులను రంగంలోకి దించింది. వాటి ద్వారా దూరాన్నిబట్టి సుమారు 20 శాతం నుంచి 30శాతం వరకూ బస్సు టిక్కెట్ల ధరలు పెంచి దండుకుంటున్నది. శ్రావణ శుక్రవారం, శనివారం రాఖీ పండుగ, ఆపై ఆదివారం ఇలా వరుసగా మూడ్రోజులు సెలవులు రావడంతో పలు బస్టాండ్లలో రద్దీ పెరిగింది. ఆ స్థాయిలో బస్సులను పెంచాల్సిన ఆర్టీసీ యాజమాన్యం.. స్పెషల్ బస్సులను రంగంలోకి దించింది. వరుస సెలవుల నేపథ్యంలో సుమారు 70 లక్షల మంది ప్రయాణం చేస్తారనే అంచనాతో వడ్డింపులకు సిద్ధమైంది.
3,500 స్పెషల్ బస్సులు..
రాఖీ పండుగ కోసం తెలంగాణ వ్యాప్తంగా 3,500 బస్సుల వరకు రద్దీకి తగ్గట్టుగా తిప్పాలని ఆర్టీసీ యాజమాన్యం భావిస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే రద్దీగా ఉన్న రూట్లను అంచనా వేసి, శుక్రవారం ఉదయం నుంచే ఆయా రూట్లకు బస్సులు పంపింది. అయితే, మహాలక్ష్మి పథకంలో భాగంగా ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్న ఆర్టీసీ.. రాఖీపండగ సందర్భంగా నిలువునా దోచుకుంటున్నది. కొన్ని స్పెషల్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం జీరో టిక్కెట్లు ఇవ్వడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. ఇక ఉచిత ప్రయాణం ఖర్చులన్నీ మగ ప్రయాణికులపైనే వేసి, నష్టాలను నివారించుకునే పనిలో పడింది.
పథకం ప్రకారం స్పెషల్ బస్సులు..
రాఖీ పండుగ రద్దీని క్యాష్ చేసుకోవాలనే కోణంలో ఆర్టీసీ అధికారులు ఓ పథకాన్ని ముందుకు తెచ్చినట్టు తెలుస్తున్నది. బస్డిపోల్లో ఎక్స్ప్రెస్, ఆర్డనరీల సర్వీసులను ఆపేసి.. స్పెషల్ బస్సులను పాయింట్లలో పెడుతున్నట్టు ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. దీంతో అప్పటికే పిల్లలతో బయలుదేరిన కుటుంబాలు తప్పనిసరి పరిస్థితుల్లో స్పెషల్ బస్సులు ఎక్కుతున్నారని అంటున్నారు. దీంతో నష్టాలను నివారించుకునేందుకు ఆర్టీసీ నానా పాట్లుపడుతూ.. ప్రయాణికులను ఎన్నో ఇబ్బందులు పెడుతున్నదని వాపోతున్నారు. ఈ మాత్రం దానికి ఎందుకు ఫ్రీ బస్సులు పెట్టాలని, వాటి ఆశచూపి తమను ఎందుకు ఇబ్బంది పెట్టాలని మహిళా ప్రయాణికులు మండిపడుతున్నారు.