Sankranti – TGSRTC| సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే వారికోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) స్పెషల్ ఏర్పాట్లు చేస్తోంది. సురక్షితంగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు 6,432 స్పెషల్ బస్సులు నడపాలని నిర్ణయించిన టీజీఎస్ఆర్టీసీ.. అందులో 557 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించింది. 2024లో 4,484 స్పెషల్ బస్సులు నడిపేందుకు ప్రణాళిక రూపొందించినా.. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో 5,246 బస్సులు నడిపింది. గతానుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈ దఫా 6,432 బస్సులు ఏర్పాటు చేసింది. జనవరి 9-15 మధ్య ఈ స్పెషల్ బస్సులు అందుబాటులో ఉంటాయి. జేబీఎస్, ఎంజీబీఎస్లతోపాటు హైదరాబాద్లోని రద్దీ ప్రదేశాలు ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఆరాంఘర్, ఎల్బీనగర్ క్రాస్ రోడ్స్, కేపీహెచ్బీ, బోయిన్ పల్లి, గచ్చిబౌలి తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు బయలుదేరుతాయి. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసేందుకు టీజీఎస్ఆర్టీసీ స్పెషల్ అధికారులను నియమించింది.
తెలంగాణతోపాటు ఏపీలోని ప్రధాన నగరాలకు ప్రత్యేక సర్వీసులు నడుపనున్నది. అమలాపురం, కాకినాడ, కందుకూరు, నర్సాపురం, పోలవరం, రాజమహేంద్ర వరం, రాజోలు, ఉదయగిరి, విశాఖపట్నం, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, విజయవాడ, శ్రీశైలం, తిరుపతి తదితర ప్రాంతాలకు ఈ స్పెషల్ సర్వీసులు నడుస్తాయి. అలాగే తెలంగాణతోపాటు ఏపీ నుంచి తిరుగు ప్రయాణమయ్యే వారికి కూడా స్పెషల్ బస్సు సర్వీసులు ఏర్పాటు చేసింది. కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ నుంచి ప్రయాణికులకు ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులో ఉండేలా ప్రణాళిక రూపొందిస్తోంది.
మహాలక్ష్మి పథకంలో భాగంగా సంక్రాంతికి నడిపే పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణ వసతి అమల్లో ఉంటుంది. అయితే, ప్రయాణ సమయంలో మహిళలు తప్పనిసరిగా జీరో టికెట్లు తీసుకోవాలని టీజీఎస్ఆర్టీసీ తెలిపింది. ప్రత్యేక బస్సుల్లో ముందస్తుగా www.tgsrtcbus.inలో రిజర్వేషన్ చేసుకోవాలని వెల్లడించింది.