హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): ఐటీఐ విద్యనభ్యసించే విద్యార్థులకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ శుభవార్త చెప్పారు. హైదరాబాద్, వరంగల్లోని ఆర్టీసీ ఐటీఐ కాలేజీల్లో వివిధ ట్రేడ్లలో ప్రవేశాలకు ఆసక్తి గల విద్యార్థుల నుంచి టీజీఎస్ఆర్టీసీ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన ‘ఎక్స్’ వేదికగా వివరాలు వెల్లడించారు. మోటర్ మెకానిక్, మెకానిక్ డీజిల్, వెల్డర్, పెయింటర్ ట్రెడ్లలో ప్రవేశాలు జరుగుతున్నాయని తెలిపారు.
ప్రవేశం పొందిన విద్యార్థులకు కోరుకున్న టీజీఎస్ఆర్టీసీ డిపోల్లో అప్రెంటీస్షిప్ సౌకర్యాన్ని సంస్థ కల్పిస్తున్నట్టు వెల్లడించారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో ఈ నెల 21వ తేదీలోపు https://iti.telangana.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఐటీఐ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు హైదరాబాద్లోని హాకీంపేట, వరంగల్ ములుగు రోడ్లోని ఐటీఐ కళాశాలలను నేరుగా సంప్రదించాలని పేర్కొన్నారు.