నర్సాపూర్: ఓవైపు విపరీతమైన వర్షాలు కురిసి ప్రజల జీవనం అస్తవ్యస్తమవుతుంటే తెలంగాణ ఆర్టీసీ (TGSRTC) మాత్రం ములీగే నక్క మీద తాటికాయ పడిందన్న చందంగా బస్సు టికెట్ చార్జీలు పెంచి ప్రయాణికులు నడ్డి విరుస్తుంది. సమయం లేదు, సందర్భం లేదు, ప్రత్యేక రోజంటూ లేదు. కానీ ప్రయాణికుల మీద అదనపు టికెట్ భారం మోపుతూ ఆర్టీసీ జేబులు నింపుకుంటుంది. వివరాల్లోకి వెళితే నర్సాపూర్ మున్సిపాలిటీ ఒకటవ వార్డు హనుమంతపూర్ గ్రామానికి చెందిన వెంకటేష్ అనే వ్యక్తి ప్రతిరోజు నర్సాపూర్ నుంచి మెదక్‌కు రూ.70 చార్జి చెల్లించి మెదక్ వెళ్తుంటాడు. రోజు మాదిరిగానే సోమవారం కూడా నర్సాపూర్ బస్‌స్టాప్‌లో నర్సాపూర్ డిపోకు చెందిన ఎక్స్‌ప్రెస్ బస్సు ఎక్కి మెదక్ బయలుదేరాడు. కండక్టర్‌ను టికెట్ అడగగా ఆయన ఇచ్చిన టికెట్‌ను చూసి అవాక్కయ్యాడు. ప్రతిరోజు రూ.70 తీసుకుంటుండగా, ఈరోజు మాత్రం రూ.30 అదనంగా రూ.100 ఉండడంతో షాక్ తిన్నాడు. ఇదేంటని కండక్టర్‌ను ప్రశ్నించగా మాకేం తెలియదు సార్.. ఈరోజు స్పెషల్ అంట అని సమాధానం ఇచ్చాడు.
దేనికోసం స్పెషల్ అని ప్రయాణికుడు అడిగితే మాకేం తెలియదు సార్.. డిపో మేనేజర్ని అడగండి అంటూ నిర్లక్ష్యంగా జవాబు ఇచ్చాడని వెంకటేష్‌తో పాటు మిగతా ప్రయాణికులు వాపోయారు. ప్రయాణికుల పైన అదనపు భారం మోపుతూ ప్రభుత్వం నిలువు దోపిడి చేస్తుందని మండిపడ్డారు. ఈ విషయంపై డిపో మేనేజర్ సురేఖను వివరణ కోరగా స్పందించడం లేదు.