హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): గౌలిగూడ తాకట్టుపై సర్కారు స్పష్టత నివ్వాలని టీజీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ) రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక ప్రకటనలో డిమాండ్ చేసింది. మహాలక్ష్మి పథకం కింద టీజీఎస్ ఆర్టీసీకి సర్కార్ ఇచ్చిన నిధులపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని కోరింది. ఇప్పటివరకు రూ.6,686 కోట్లను ఆర్టీసీ సంస్థకు ఇచ్చినట్టు రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా చెప్పకుంటున్నదని, ఈ అంశంపై ఆర్థిక శాఖ ద్వారా ఇచ్చిన నిధులు, వాటి లెకలను శ్వేతపత్రంలో విడుదల చేయాలని కోరింది. తద్వారా తెలంగాణ పజానీకానికి, ఆర్టీసీ కార్మికులకు ఉన్న అనుమానాలు తొలగించాలని ఈయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్ బాబు, ఈదురు వెంకన్న కోరారు.
ఆర్టీసీ లాభాల్లో ఉంటే ఆస్తుల తాకట్టు ఎందుకు పెడుతున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గౌలిగూడ బస్‌స్టేషన్‌ను తాకట్టు పెట్టి రూ.400 కోట్లకు బ్యాంకు రుణం ఎలా తీసుకుంటారో చెప్పాలని పేర్కొన్నారు. దీనిపై ఆర్టీసీ యాజమాన్యం సమాధానం చెప్పాలని కోరారు. మహాలక్ష్మి పథకం ద్వారా భారీగా లాభాలు గడించిదని చెప్పి సంబురాలు చేసుకొని, వారం గడువక ముందే బ్యాంకుల నుంచి, ఆస్తులు తాకట్టుపెట్టి అప్పులు తీసుకొనే దుస్థితి ఎందుకొచ్చిందని ప్రశ్నించారు.
20 నెలలుగా తరచూ 3,038 ఉద్యోగాల నోటిఫికేషన్ గురించి పత్రికలలో ప్రకటనలకే పరిమితమయ్యారని ఎస్ బాబు, ఈదురు వెంకన్న పేర్కొన్నారు. ఇప్పటికీ ఆర్టీసీలో 17 వేల సిబ్బంది రిటైర్డ్ అయ్యారని, ఈ 3,038 నియామకాలు ఏ మూలకూ సరిపోవని పేర్కొన్నారు. కనీసం 10 వేల మందిని తక్షణమే నియమించి కార్మికులపై పడిన అధిక పనిభారాలను తగ్గించాలని కోరారు.