హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): గ్రూప్-2 పోస్టుల భర్తీ కోసం ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ షెడ్యూల్‌ను విడుదల చేసింది. 783పోస్టుల భర్తీకిగాను ప్రభుత్వం డిసెంబర్ 29, 2022న నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం విధితమే. ఈ క్రమంలో ఈనెల 29నుంచి జూన్ 10వరకు ఉదయం 10.30గం.ల నుంచి మధ్యాహ్నం 1.30వరకు.. ఆ తర్వాత 2.00నుంచి సాయంత్రం 5.30వరకు నాంపల్లి పబ్లిక్‌గార్డెన్‌లోని సురవరం ప్రతాప్‌రెడ్డి యూనివర్సిటీలో సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోల్లస్ ఒక ప్రకటనలో తెలిపారు.
జూన్ 11న రిజర్వుడే ఉంటుందని, ఆరోజు ఉదయం 10.30నుంచి సాయంత్రం 5.30గం.ల వరకు సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుందని చెప్పారు. పోస్టుల కోసం షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థుల వివరాలు కమిషన్ వెబ్సైట్లో ఉంచినట్టు, పరిశీలనకు వచ్చేవారు తీసుకొచ్చే సర్టిఫికెట్ల వివరాలు ఈనెల 26నుంచి వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.
అభ్యర్థులు అన్ని ఒరిజనల్ సర్టిఫికెట్లతోపాటు, ఒక సెట్ జిరాక్స్ కాపీని కూడా తీసుకురావాలని సూచించారు. ఈనెల 27నుంచి జూన్ 11వరకు వెబ్ ఆప్షన్స్ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని, అభ్యర్థులు ఎంపిక చేసుకోవాలని కోరారు. ఎంపిక చేసుకున్న తేదీల్లో సర్టిఫికెట్ల పరిశీలనకు రానివారికి మరో అవకాశం ఉండదని, ఒకవేళ అభ్యర్థులు తక్కువైతే అందుకనుగుణంగా అభ్యర్థులను పిలుస్తామని కార్యదర్శి స్పష్టంచేశారు.