హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ) : టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో ‘కేసీఆర్ కొలువుల’ భర్తీ ప్రక్రియ కొనసాగుతున్నది. టీఆర్టీ – 2017 ఫలితాలను బుధవా రం టీజీపీఎస్సీ విడుదల చేసింది. కోర్టు కేసుల నుంచి మూడు స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ పోస్టులకు మోక్షం లభించింది. నోటిఫికేషన్లో రిలింక్విష్మెంట్ అమలు తర్వా త ఉన్న అభ్యర్థులను టీఆర్టీకి ఎంపిక చేసినట్టు టీజీపీఎస్సీ అధికారులు వెబ్‌నోట్ ద్వారా తెలిపారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 1392 అధ్యాపకుల పోస్టుల భర్తీ జరుగుతున్నది.
ఏఈఈ పోస్టుల రాత పరీక్షల ఫలితాలు విడుదల చేసి, ఎంపికైన అభ్యర్థులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. వీటితో పాటు 8039 గ్రూప్-4 పోస్టులు, 53 డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్లు (డీఏవో), 581 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు తదితర ‘కేసీఆర్ ఉద్యోగాల’ భర్తీ ప్రక్రియ త్వరగా పూర్తిచేసేందుకు టీజీపీఎస్సీ ముందుకుపోతున్నది.
అర్ధ గణాంకశాఖలో ఆంధ్రా అధికారుల తిష్ఠ!
హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): తెలంగాణ డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ (అర్ధ గణాంకశాఖ) కార్యాలయంలో ఇప్పటికీ ఆంధ్రా అధికారుల పెత్తనమే సాగుతున్నదని కొందరు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఇటీవల జరిగిన బదిలీల్లో అందరికీ ఆన్ డిప్యూటేషన్ (ఓడీ) ఆప్షన్ ఇవ్వలేదని చెప్తున్నారు. ఫలితంగా ఆర్టికల్-14 అమలును తుంగలో తొక్కారని మండిపడుతున్నారు. ఖైరతాబాద్‌లోని తెలంగాణ గణాంకభవన్ నుంచి బదిలీ అయినప్పటికీ ఓడీ సౌకర్యంతో కొందరు ఆంధ్రా అధికారులు వ్యక్తిగత ప్రయోజనాలు పొందుతున్న ట్టు ఆరోపిస్తున్నారు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి పదేండ్లు దాటినా నేటికీ తెలంగాణ గణాంకభవన్‌లో ఆంధ్రా అధికారులే ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారని ఆరోపిస్తున్నారు.బదిలీల ప్రయోజనం ఉద్యోగులందరికీ లభించడం లేదని ఇక్కడి ఉద్యోగులు వాపోతున్నారు. బదిలీల్లో ఉద్యోగులకు జరిగిన అన్యాయాన్ని హైకోర్టు న్యాయవాది సుధీర్‌కుమార్ అర్ధ గణాంకశాఖ డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. షెడ్యూల్ ప్రకారం కచ్చితంగా బదిలీలు చేపట్టాలని, లేనిపక్షంలో హైకోర్టులో న్యాయపోరాటం చేస్తామని ఆయనకు రాసిన
లేఖలో పేర్కొన్నారు.