హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ) : గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలపై ఆరోపణల నేపథ్యంలో టీజీపీఎస్సీ స్పందించింది. పరీక్షల్లో ఒకే మార్కులు రావడం సహజమని టీజీపీఎస్సీ కార్యదర్శి డాక్టర్ నవీన్ నికోలస్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మెయిన్స్ జవాబుపత్రాలను వర్సిటీల్లో పనిచేస్తున్న రెగ్యులర్ ఫ్యాకల్టీతో మూల్యాంకనం చేయించినట్టు పునరుద్ఘాటించారు. కోఠి మహిళా కాలేజీ అభ్యర్థన మేరకు మహిళా అభ్యర్థులకు మాత్రమే పరీక్ష కేంద్రం కేటాయించామని తెలిపారు. మొత్తం అభ్యర్థుల్లో 25 శాతం 18, 19 నంబర్లు గల కేంద్రాల్లో పరీక్షలకు హాజరయ్యారని, ఎంపికలోనూ ఎక్కువ నిష్పత్తి వారే ఉన్నట్టు పేర్కొన్నారు. ప్రిలిమ్స్ హాల్టికెట్లలో జిల్లా కోడ్, సెంటర్ కోడ్ ఉండటంతోనే మెయిన్స్ పరీక్షలకు వేరే హాల్టికెట్ ఇచ్చినట్టు పేర్కొన్నారు.