Group-2 | హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ): టీజీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ మేరకు గురువారం సుమారు 50 మంది నిరుద్యోగ ప్రతినిధులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు జరిపిన చర్చల్లో ఈ విషయం తేటతెల్లమైంది. అయితే ఇతర డిమాండ్లపై ఎలాంటి హామీ రాకపోవడంతో ఈ చర్చలు ఫలించలేదని నిరుద్యోగ ప్రతినిధులే తేల్చి చెప్పారు. దీంతో మళ్లీ నిరుద్యోగ ఉద్యమ కాగడా ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు.
ఒకవైపు అభ్యర్థుల వినతిని పట్టించుకోకుండా మొండిగా డీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కేవలం గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయడానికే సానుకూలత వ్యక్తంచేసింది. ఈ విషయమై సీఎం రేవంత్‌రెడ్డితో మాట్లాడి, 24 గంటల్లో వెబ్‌నోట్ వచ్చేలా కృషి చేస్తామన్న ప్రభుత్వ ప్రతినిధుల హామీతో నిరుద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్నది.
నెలరోజుల తమ పోరాటాలకు ప్రభుత్వం ఒక మెట్టు దిగినా తమ డిమాండ్ల పరిష్కారానికి మాత్రం పూర్తి భరోసా రాలేదని నిరుద్యోగులు మండిపడుతున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం గ్రూప్ 2, 3లో అసలు పోస్టుల సంఖ్యను పెంచుతారా? లేదా? అన్న అంశంపై స్పష్టత కరువైందని ఆగ్రహంతో ఉన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ ప్రతినిధులు తమతో జరిపిన చర్చలు ఫలప్రదంగా లేవని నిరుద్యోగ ప్రతినిధులు తేల్చిచెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతినిధులుగా ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, మానవతారాయ్, చరణ్‌కౌశిక్, బాలలక్ష్మి తదితరులు నిరుద్యోగులతో చర్చలు జరిపారు. నిరుద్యోగుల తరఫున దాదాపు 50 మంది ప్రతినిధులు ఈ చర్చల్లో పాల్గొన్నట్టు సమాచారం.
గ్రూప్-1 మెయిన్స్ కోసం 1:100 నిష్పత్తి అమలు విషయమై నిరుద్యోగ ప్రతినిధులు చర్చల సందర్భంగా నిలదీసినట్టు సమాచారం. దీనిపై సాంకేతిక సమస్యలను సాకుగా చూపి ప్రభుత్వం తప్పించుకోజూస్తున్నదని నిరుద్యోగ ప్రతినిధులు మండిపడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో గ్రూప్ 1 కోసం విడుదల చేసిన జీవో 29ను వెనక్కి తీసుకొని, కొత్తగా అమల్లోకి తెచ్చిన షార్ట్‌ఫాల్ విధానం రద్దు చేసి, కమ్యూనిటీ పోస్టుల వారీగా అభ్యర్థులను మెయిన్స్‌కు ఎంపిక చేసే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఉద్యోగార్థుల డిమాండ్ల పరిష్కారం కోసం ఉద్యమాలే దిక్కని నిరుద్యోగ నేతలు పిలుపునిచ్చారు. కేవలం మొక్కుబడిగానే ప్రభుత్వం చర్చలు జరిపిందని, తమ డిమాండ్లను నెరవేరుస్తామని స్పష్టమైన హామీని ఇవ్వలేకపోయిందని నిరుద్యోగులు మండిపడుతున్నారు. గ్రూప్ 1, జీవో 29 రద్దు, గ్రూప్ 2, 3లో అదనపు పోస్టుల పెంపు, గురుకుల పోస్టుల్లో రీలింక్విష్మెంట్ అమలు, నిరుద్యోగ భృతి, జీవో 46న రద్దు, రెండు లక్షల ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలండర్ విడుదల వంటి డిమాండ్లను పరిష్కరించేంత వరకు ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదని తెలంగాణ నిరుద్యోగ జేఏసీ స్పష్టం చేసింది.