TGPSC | హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ) : గ్రూప్-1 మెయిన్‌కు హాజరైన అభ్యర్థుల్లో తొలుత ప్రకటించిన సంఖ్యకు తుది జాబితాకు మధ్య 10 మంది పెరిగిన మాట వాస్తవమేనని టీజీపీఎస్సీ అంగీకరించింది. తొలుత ప్రకటించిన అభ్యర్థుల సంఖ్య కంటే ఆ తరువాత శాస్త్రీయంగా సేకరించిన వివరాలను బేరీజు వేశాక ఆ సంఖ్య మరో పది పెరిగిందని హైకోర్టుకు తెలియజేసింది. గ్రూప్-1 నియామకాలను తాతాలికంగా నిలిపివేయాలని ఈ నెల 17న సింగిల్ జడ్జి జారీచేసిన మధ్యంతర ఉత్తర్వులను రద్దుచేయాలని కోరుతూ టీజీపీఎస్సీ ద్విసభ్య ధర్మాసనం ఎదుట అప్పీల్ పిటిషన్ దాఖలు చేసింది. టీజీపీఎస్సీ అదనపు కార్యదర్శి సుమతి (నోడల్ ఆఫీసర్ -లీగల్ ) ఈ అప్పీల్ పిటిషన్‌ను దాఖలు చేశారు. గత ఏడాది అక్టోబరు 21 నుంచి 27 వరకు జరిగిన మెయిన్ పరీక్షలు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మలాజిగిరి జిల్ల్లాల (మూడు కమిషనరేట్లు) పరిధిలో జరిగాయని తెలియజేసింది. పరీక్షలు పూర్తవగానే సూపరింటెండెంట్లు ఇచ్చిన సమాచారం ఆధారంగా హాజరైన అభ్యర్థుల సంఖ్యను 21,075 అని ప్రకటించామని పేర్కొంది. ఆ తరువాత అభ్యర్థులు ఉపయోగించిన, ఉపయోగించని జవాబు పత్రాలు ఓఎంఆర్, నామినల్ రోల్స్ మొత్తం విశ్లేషించిన మీదట వారి సంఖ్య 21,085కు పెరిగిందని వివరించింది. పది మంది అభ్యర్థుల సంఖ్య పెరగడం వెనుక లెకింపుల్లో తేడా జరిగిందని తెలిపింది. ఆ మేరకు మళ్లీ ప్రకటన విడుదల చేశామని పేర్కొంది. బీ పూజితారెడ్డి అనే అభ్యర్థిని రీకౌంటింగ్‌లో తేడా ఉందని 60 మారులు తగ్గాయని వినతిపత్రం సమర్పించారని, దీనిని పరిశీలిస్తే కౌంటింగ్‌కు ముందు ఆ తర్వాత కూడా ఆమె మారులు 422.4 వచ్చాయని, ఆమె వినతిపత్రంలో మారులను తారుమారు చేసి ఇచ్చారని అప్పీల్ పిటిషన్లో వివరించారు.
పరీక్ష కేంద్రాలను గుర్తించడానికి, తనిఖీలు చేయడానికి టీజీపీఎస్సీకి తగిన సిబ్బంది లేకపోవడంతో ఆ బాధ్యతను జిల్లా కలెక్టర్లుకు ఇచ్చామని తెలిపారు. కోఠి మహిళా కాలేజీలో పురుషులకు ప్రత్యేక మరుగుదొడ్లు లేకపోవడంతో ఆ కేంద్రాన్ని మహిళా అభ్యర్థులకు మాత్రమే కేటాయించామని పేర్కొన్నారు. బేగంపేట కాలేజీలో కేవలం మహిళలే ఉన్నారని, కోఠి మహిళా కళాశాలలోని రెండు సెంటర్ల నుంచి ఎకువమంది అర్హత సాధించారన్న ఆరోపణలు అవాస్తవమని తెలిపారు. 18వ సెంటర్లో 5.41 శాతం, 19వ సెంటర్లో 4.12 శాతం చొప్పున అభ్యర్థులు అర్హత సాధించడం అసాధారణ విషయమేమీ కాదని అన్నారు. ఒకే సెంటర్ నుంచి ఎకువ మంది ఎంపికవడంలో తప్పేమీలేదని తెలిపారు. ఎస్టీ క్యాటగిరీలో టాప్ ర్యాంకు 206 కాదని, ఎరుకుల సామాజికవర్గానికి చెందిన యువతికి 12వ ర్యాంక్ వచ్చిందని తెలియజేశారు. ప్రిలిమ్స్ రాష్ట్రవ్యాప్తంగా జరిగినందున హాల్ టికెట్లపై జిల్లా, పరీక్ష కోడ్ వేయాల్సివచ్చిందని వివరించారు. అయితే, మెయిన్ పరీక్ష కేవలం జీహెచ్ఎంసీ పరిధిలోనే నిర్వహించినందున కోడ్ల విషయంలో అయోమయం ఏర్పడకుండా ఉండేందుకే మళ్లీ వేరే హాల్‌టికెట్లు ఇవ్వాల్సివచ్చిందని వివరించారు. బొమ్ము పూజితరెడ్డి అనే అభ్యర్థి తనకు రీకౌంటింగ్ తర్వాత మారులు తగ్గాయని తప్పుడు వినతిపత్రం ఇచ్చారని, ఆమెపై సర్వీస్ కమిషన్ చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
సీవీఆర్ కాలేజీలో మొదట 984 మంది అభ్యర్థులకు ప్రతిపాదన చేశామని, మహిళా విశ్వవిద్యాలయంలోని పరీక్ష కేంద్రంలో గ్రౌండ్ ఫ్లోర్ ఎత్తు ఎకువగా ఉన్నందున దివ్యాంగులకు ఇబ్బంది అవుతుందని భావించి ఇకడి నుంచి 87 మందిని సీవీఆర్ కాలేజీకి కేటాయించామని టీజీపీఎస్సీ తన అప్పీల్లో వివరించింది. దీని ఫలితంగా మహిళా విశ్వవిద్యాలయంలో అభ్యర్థులు 984 నుంచి 787కు తగ్గారని తెలిపింది. సెయింట్ పీటర్స్ ఇంజినీరింగ్ కాలేజీలో అభ్యర్థుల సంఖ్య 504 నుంచి 358 మందికి తగ్గిందని, 24 మంది సామర్థ్యం ఉన్న గదిలో దివ్యాంగులకు తోడుగా పరీక్ష రాయడానికి వచ్చే వారు ఉన్నందున, ఒక్కో గదిలో ఆరుగురినే కేటాయించాల్సి వచ్చిందని తెలియజేసింది. దీనివల్ల అదనంగా మరో పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సివచ్చిందని తెలిపింది. మూల్యాంకనం కోసం ఇంగ్లిష్‌కు 33, జనరల్ ఎస్సే 57, చరిత్ర, సంసృతి 28, జాగ్రఫీ 22, ఇండియన్ సొసైటీ 22, రాజ్యాంగం 24, పరిపాలన 23, ఆర్థికశాస్త్రం, అభివృద్ధి 38, సైన్స్ అండ్ టెక్నాలజీ 21, బయోటెక్నాలజీ 26, డాటా ఇంటర్‌ప్రిటేషన్ 18, తెలంగాణ ఉద్యమం, రాష్ట్రం ఏర్పాటు అంశానికి 40 మంది చొప్పున కేటాయించామని వివరించింది.
హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో గ్రూప్-1 నియామకాలను తాతాలికంగా నిలిపివేస్తూ ఈ నెల 17న జారీచేసిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు పొడిగించింది. గ్రూప్-1 మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయంటూ ఎం పరమేశ్ మరో 20 మంది అభ్యర్థులు దాఖలు చేసిన కేసులో న్యాయమూర్తి జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు ఈ నెల 17న నియామకాల ప్రక్రియను నిలిపివేయాలని ఆదేశాలిచ్చారు. ఆ వ్యాజ్యం సోమవారం విచారణకు వచ్చినప్పుడు.. సర్వీస్ కమిషన్ న్యాయవాది జోక్యం చేసుకుంటూ మధ్యంతర ఉత్తర్వులను సస్పెండ్ చేయాలని కోరుతూ టీజీపీఎస్సీ ద్విసభ్య ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేసినట్టు చెప్పారు. దీంతో విచారణ వాయిదా పడింది. మధ్యంతర ఉత్తర్వులు అమల్లో ఉంటాయని వెల్లడించింది.