హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): గ్రూప్-1లో టాప్10 అభ్యర్థులు ఆర్డీవో పోస్టులను ఎంపిక చేసుకున్నారని టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం వెల్లడించారు. గ్రూప్-1 తుది ఫలితాలను టీజీపీఎస్సీ బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. 562 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను వెల్లడించింది. పోస్టుల ప్రాధాన్యక్రమం, రోస్టర్‌పాయింట్లు, రిజర్వేషన్, వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఒక పోస్టుకు సంబంధించిన వ్యవహారం కోర్టులో ఉన్నందున పక్కనపెట్టినట్టు చైర్మన్ తెలిపారు. లక్ష్మీదీపిక, దాడి వెంకటరమణ, వంశీకృష్ణారెడ్డి, జిన్నా తేజస్విని, కృతిక, హర్షవర్ధన్, అనూష, నిఖిత, భవ్య, కృష్ణసాయి టాప్10 లో నిలిచినట్టు వివరించారు. ఎంపిక మాత్రం కోర్టు తుది తీర్పునకు లోబడి ఉంటుందని స్పష్టంచేశారు. తుది ఎంపికలో మల్టీజోన్-1లో 258, మల్టీజోన్-2లో 304 మంది అభ్యర్థులను ఎంపిక చేసినట్టు వివరించారు.
గ్రూప్-1 పరీక్షకు 2024 ఫిబ్రవరిలో టీజీపీఎస్సీ నోటిఫికేషన్ జారీచేసింది. మెయిన్స్ పరీక్షలను అక్టోబర్ 21 నుంచి 27 వరకు నిర్వహించారు. మార్చి 30న మెయిన్స్‌లో అన్ని పరీక్షలకు హాజరైన 21,085 మంది అభ్యర్థుల మార్కులను ప్రకటించారు. ఏప్రిల్‌లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తిచేశారు. అయితే కొందరు వివిధ కారణాలతో ఫలితాలను ప్రకటించవద్దని హైకోర్టును ఆశ్రయించారు. దీంతో విచారణ జరిపిన సింగిల్ బెంచ్ రీవాల్యూయేషన్ చేయాలని, లేదంటే పరీక్షను రద్దు చేయాలని ఆదేశించింది. దీనిపై టీజీపీఎస్సీ డివిజన్ బెంచ్‌కు అప్పీల్ చేసింది.
ఈ క్రమంలో బుధవారం హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ స్టే విధించింది. ఈ నేపథ్యంలో టీజీపీఎస్సీ.. రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్లు, మార్కులను పరిగణలోకి తీసుకొని అభ్యర్థుల మెరిట్ జాబితాను రూపొందించి బుధవారం అర్ధరాత్రి ఫలితాలు ప్రకటించింది.