హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 31 (నమస్తే తెలంగాణ ) : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూములు తమవేనని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడాన్ని హెచ్సీయూ రిజిస్ట్రార్ తీవ్రంగా ఖండించారు. వేలం విషయంలో టీజీఐఐసీ ప్రకటన పూర్తిగా అవాస్తవమని సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వం అధికారికంగా ఆ భూముల్లో ఎలాంటి సర్వే చేపట్టలేదని, భూ బదలాయింపునకు తాము అంగీకరించలేదని స్పష్టంచేశారు. ఆ భూముల విషయంలో యూనివర్సిటీ నుంచి ప్రభుత్వం, టీజీఐఐసీ ఎలాంటి అనుమతులు, అంగీకారం తీసుకోలేదని వెల్లడించారు. యూనివర్సిటీ భూములను బదలాయించాలంటే, యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆమోదం పొందాలని స్పష్టంచేశారు. యూనివర్సిటీ పరిధిలోని భూములను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని, ఇక్కడి పర్యావరణం, జీవవైవిధ్యాన్ని సంరక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. 400 ఎకరాల భూములను కార్పొరేట్ శక్తులకు అప్పగించడానికి యూనివర్సిటీ అంగీకరించిందనే అసత్య వార్తలను ప్రచారం చేయొద్దని కోరారు.
భూముల వేలాన్ని
హెచ్సీయూ పరిధిలోని 400 ఎకరాల భూములను వేలం వేయడం సరైన నిర్ణయమేనని కాంగ్రెస్ సర్కార్ సమర్థించుకున్నది. ఆ భూములు తమకే చెందుతాయని రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. 2004లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రైవేట్ సంస్థకు ఆ భూమిని కేటాయించగా, సుప్రీంకోర్టులో ఉన్న కేసును గెలవడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం యాజమాన్య హక్కులను దక్కించుకున్నదని స్పష్టం చేసింది. ఆ భూమికి సంబంధించి సృష్టించే ఏ వివాదమైనా కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని హెచ్చరించింది. 400 ఎకరాల భూముల్లో ఎలాంటి చెరువులు, జీవవైవిధ్యం లేదని మరోసారి పేర్కొన్నది.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోని 400 ఎకరాల భూమి విషయంలో టీజీఐఐసీ విడుదల చేసిన ప్రకటనలో ఎలాంటి నిజం లేదు. 2024 జూలైలో యూనివర్సిటీ పరిధిలో ఎలాంటి సర్వే జరగలేదు. ఇప్పటివరకు కేవలం ప్రాథమిక పరిశీలన మాత్రమే చేపట్టారు. భూమి హద్దుల నిర్ణయానికి మేం అంగీకరించలేదు. యూనివర్సిటీ పరిధిలోని భూములను బదలాయించాలంటే, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆమోదం ఉండాలి. యూనివర్సిటీ పరిధిలోని భూముల పర్యావరణం, జీవవైవిధ్యాన్ని పరిరక్షించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం.
హెచ్సీయూ పరిధిలోని 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదే. ఆ భూమికి యజమాని తానేనని తెలంగాణ ప్రభుత్వం నిరూపించుకున్నది. 21 ఏండ్ల క్రితం ప్రైవేట్ సంస్థకు కేటాయించిన భూమిని న్యాయపోరాటం ద్వారా ప్రభుత్వం దక్కించుకున్నది. ప్రభుత్వం వేలం వేసే భూమిలో ఉన్న రాళ్లు, పర్యావరణం, జీవవైవిధ్యానికి ఎలాంటి విఘాతం కలగనివ్వం. భూముల వేలాన్ని వ్యతిరేకించేవారంతా రాజకీయ నాయకుల, స్థిరాస్తి వ్యాపారుల ప్రయోజనాలకు అనుకూలంగా విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నారు.