హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 6 (నమస్తే తెలంగాణ) : ఫ్యాన్సీ నంబర్ల వేలంలో రాష్ట్ర రవాణా శాఖపై మరోసారి కాసుల వర్షం కురిసింది. తాజాగా ఖైరాతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో నిర్వహించిన వేలంలో కీస్టోన్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారు రూ.18 లక్షలు వెచ్చించి టీజీ09జే9999 నంబర్‌ను కైవసం చేసుకోగా.. టీజీ09కే0006 నంబర్‌ను నామాల అనంతలక్ష్మి కుమారి రూ.7,06,666కు దక్కించుకున్నారు. ఈ వేలంలో వివిధ ఫ్యాన్సీ నంబర్లకు కలిపి మొత్తం 43.57 లక్షల ఆదాయం సమకూరినట్టు రవాణా శాఖ అధికారులు తెలిపారు.
హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ) : తత్కాల్ కింద పదో తరగతి వార్షిక పరీక్షల ఫీజు చెల్లింపునకు ఎస్సెస్సీ బోర్డు అవకాశమిచ్చింది. రూ.1,000 ఆలస్య రుసుముతో ఈ నెల 21 నుంచి 27 వరకు పరీక్ష ఫీజును చెల్లించాలని బోర్డు డైరెక్టర్ పీవీ శ్రీహరి తెలిపారు. ఆయా తేదీల్లో విద్యార్థులు హెచ్ఎంలకు చెల్లించాలని, హెచ్ఎంలు ఈ నెల 28లోగా ఆన్లైన్లో సైబర్ ట్రెజరీలో జమ చేసి, 29లోపు ఫీజు చెల్లించిన వారి వివరాలు సమర్పించాలని డైరెక్టర్ శ్రీహరి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.