TG Weather | తెలంగాణవ్యాప్తంగా చలితీవ్రత పెరిగింది. ఎముకలు కొరికే చలికి జనం తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. ఉదయం వేళల్లో భారీగా పొగమంచు కురుస్తున్నది. దానికి తోడు చలిగాలులు వీస్తుండడంతో జనం అల్లాడుతున్నారు. ఈ క్రమంలో వాతావరణశాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. రాగల రెండురోజులు తెలంగాణలో అక్కడక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే నాలుగు నుంచి ఐదు డిగ్రీల వరకు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. సోమవారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ చలిగాలులు వీస్తాయని హెచ్చరించింది. మంగళవారం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో శీతలగాలులు వీచే ఛాన్స్ ఉందని హెచ్చరించింది.
ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. ఆ తర్వాత రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని చెప్పించింది. ఇదిలా ఉండగా.. గడిచిన 24 గంటల్లో పలుచోట్ల ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోయాయి. ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో అత్యల్పంగా 7.4 డిగ్రీ సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణశాఖ తెలిపింది. రాగల రెండు రోజులు చలి తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణశాఖ హెచ్చరించింది. అదే సమయంలో హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. సోమవారం ఉదయం ఈ సీజన్లోనే ఉష్ణోగ్రతలు కనిష్టానికి పడిపోయాయని వాతావరణశాఖ తెలిపింది. హైదరాబాద్ యూనివర్సిటీ పరిధిలో 8.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైందని పేర్కొంది. రాజేంద్రనగర్‌లో 10, కంటోన్మెంట్లో 11.2, మారేడ్‌పల్లిలో 11.5, కుత్బుల్లాపూర్‌లో 12, గచ్చిబౌలిలో 12 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయని.. సోమవారం రాత్రి సైతం చలి కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. మంగళవారం ఉదయం సైతం ఇలాంటి పరిస్థితులే ఏర్పడే అవకాశాలున్నాయని హెచ్చరించింది.