హైదరాబాద్, మార్చి 1 (నమస్తే తెలంగాణ): మార్చి నెలలో విద్యుత్తు డిమాండ్ 17,500 మెగావాట్ల గరిష్ఠ స్థాయికి చేరే అవకాశం ఉన్నదని టీజీ ట్రాన్స్కో అంచనా వేసింది. ఈ డిమాండ్ నేపథ్యంలో విద్యుత్తు సంస్థలు అన్నిరకాల ఏర్పాట్లు చేశాయని సంస్థ పేర్కొన్నది. వేసవి డిమాండ్ దృష్ట్యా అదనపు సబ్స్టేషన్లు, పవర్ ట్రాన్స్ఫార్మర్లు, ఫీడర్ల పెంపును చేపట్టామని, ఈ పనులు మార్చి 10 కల్లా పూర్తవుతాయని, విద్యుత్తు కోతలు ఉండబోవని సంస్థ వెల్లడించింది. గరిష్ఠ డిమాండ్ మేరకు విద్యుత్తు సరఫరా చేసేందుకు విద్యుత్తు సంస్థలు సిద్ధంగా ఉన్నట్టు పేర్కొన్నది. విద్యుత్తు గరిష్ఠ డిమాండ్ 2022-23లో 15,497 మెగావాట్లు, 2023-24లో 15,623, 2024-25లో 16,601 మెగావాట్లుగా నమోదైనట్టు సంస్థ తెలిపింది.
గతంలో బయటి రాష్ర్టాల నుంచి విద్యుత్తు పొందేందుకు పీపీఏలు కుదుర్చుకున్నామని, ఈ మేరకు ఎన్టీపీసీ, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్, సోలార్ విద్యుత్తును తీసుకుంటున్నట్టు తెలిపింది. రాష్ట్రంలో ఏ టా గరిష్ట డిమాండ్ మార్చిలో నమోదవుతుందని, ఏప్రిల్ నుంచి రబీ పంట కోతలతో ఈ డిమాండ్ తగ్గుతుందని సంస్థ అంచనా వేసింది. యాదాద్రి పవర్ ప్లా ంట్లో 800 మెగావాట్ల యూనిట్-2లో గత సెప్టెంబర్ నుంచి ఉత్పత్తి ప్రారంభంకాగా, నవంబర్ నుంచి యూనిట్-1లో ఉత్పత్తి ప్రారంభించామని, మిగతా మూడు యూనిట్లను జూన్ నాటికి అందుబాటులోకి తెస్తామని సంస్థ తెలిపింది.